గురుసేవా మహిమ

పూర్వం గురుకులాలు ప్రశాంతమైన వాతావరణంలో కొనసాగినప్పటికీ, బాగా చదువుకునే విద్యార్థుల పట్ల మిగతావారు అసూయ ద్వేషాలను ప్రదర్శిస్తూ వుండేవారు. అయితే ఆనాటి గురువులు వెంటనే ఆ విషయాన్ని గ్రహించి, ఈర్ష్యతో రగిలిపోతున్న వారి కళ్లు తెరిపించి వారిని సరైన దారిలో నడిపించే వారు. అలాంటి సంఘటన ఆదిశంకరాచార్యుల వారి శిష్య బృందం లోనూ జరిగింది.

ఆదిశంకరాచార్యుల వారి శిష్యులలో 'సనందుడు' అనే విద్యార్థి ఉండేవాడు. ఒక శిష్యుడిగా అన్ని విషయాల్లోనూ అంకిత భావాన్ని ప్రదర్శిస్తూ అనతికాలంలోనే ఆయన శంకరాచార్యుల వారి ప్రియ శిష్యుడనిపించుకున్నాడు. ఇది మిగతా శిష్యులకు అసూయ కలిగించింది. దాంతో వాళ్లు ఆయనపై అనేక సార్లు గురువుకి ఫిర్యాదు చేశారు. విషయాన్ని గ్రహించిన శంకరాచార్యుల వారు, గురువుపట్ల భక్తి శ్రద్ధలు ... ఆయన ఆదేశం పట్ల విశ్వాసం సనందుడిలో ఏ స్థాయిలో వున్నాయో మిగతావారికి తెలియపరచాలని నిర్ణయించుకున్నాడు.

ఒకసారి పూజకు అవసరమైన పువ్వులు తేవడం కోసం సనందుడు పడవపై గంగానది అవతలి ఒడ్డుకు వెళ్లాడు. ఇవతల ఒడ్డున శంకరాచార్యులు శిష్యులతో కలిసి కూర్చున్నారు. వాళ్లందరికీ అవతల ఒడ్డున సనందుడు పువ్వులు కోయడం కనిపిస్తూనే వుంది. అతను రాక మునుపే పాఠం చెప్పించుకోవాలని మిగతావాళ్లు శంకరుల వారిని తొందరపెట్టసాగారు. వాళ్ల కళ్ళు తెరిపించడానికి అదే సరైన సమయంగా భావించి, శంకరుల వారు సనందుడిని వెంటనే రమ్మంటూ కేక వేశారు.

అంతే సనందుడు పడవ గురించి కూడా ఆలోచించకుండా, లోతైన గంగానదిపై గబగబా అడుగులు వేస్తూ నడిచి వచ్చేశాడు. నదిలో ఆయన అడుగువేయబోయిన ప్రతిచోట లోపలి నుంచి పద్మం రావడం, దానిపై అడుగు మోపుతూ సనందుడు ఇవతల గట్టుకి చేరుకోవడం చూసి మిగతా వారు ఆశ్చర్యపోయారు. గురువాక్యంపై ఆయనకి గల విశ్వాసాన్ని అభినందిస్తూ, తమని మన్నించ వలసిందిగా కోరారు. పద్మాలపై నడచి వచ్చిన తన శిష్యుడికి శంకరులవారు 'పద్మపాదుడు' అనే బిరుదును ప్రసాదిస్తూ ప్రశంసించారు.


More Bhakti News