బాసర

సాక్షాత్తు సత్య లోకం నుంచి కదిలి వచ్చి సరస్వతీ దేవి కొలువుదీరిన పరమ పవిత్రమైన క్షేత్రమే 'బాసర'. ఆదిలాబాద్ జిల్లాలోని ఈ క్షేత్రం అక్షరాభ్యాస కార్యక్రమాలతో కళకళలాడుతూ కనిపిస్తుంది. ఇక్కడి అమ్మవారు ' జ్ఞాన సరస్వతి'గా పూజలందుకుంటూ వుంటుంది. అమ్మవారు ఇక్కడ ఆవిర్భవించడానికి కారణమైన కథ ఒకటి స్థల పురాణంగా వినిపిస్తుంది.

పూర్వం అమ్మవారు సత్య లోకం నుంచి అదృశ్యం కావడంతో, దేవతలంతా మాటను కోల్పోయి బ్రహ్మదేవుడిని ఆశ్రయించారు. ఈ విషయమై వ్యాస మహర్షిని కలుసుకోమని ఆయన సైగల ద్వారా చెప్పగా, వారంతా వ్యాస మహర్షిని కలుసుకున్నారు. విషయం తెలుసుకున్న వ్యాసుడు అమ్మవారిని గురించి ప్రార్ధించగా, అమ్మవారు తనని గోదావరి నదీ తీరంలోని ఫలానా ప్రదేశంలో ప్రతిష్ఠించమని కోరింది.

వ్యాస మహర్షి తన శిష్య గణంతో ఆ ప్రదేశానికి చేరుకొని అక్కడ కొంతకాలం తపస్సు చేశాడు. ప్రతి ఉదయం సూర్యుడికి అర్ఘ్యం విడిచి గోదావరి నుంచి ఒక పిడికెడు ఇసుక తెచ్చి ఒక ప్రదేశంలో పోసేవాడు. అలా కొంత కాలమయ్యాక ఒక శుభ ముహూర్తాన, ఆ ఇసుకతోనే అమ్మవారి మూర్తిని మలిచి ప్రతిష్ఠించాడు. ఆ క్షణం నుంచి దేవతలందరికి మాట వచ్చింది. వ్యాస మహర్షి ప్రతిష్ఠిత క్షేత్రం కనుక ఈ క్షేత్రానికి 'వ్యాసర' అనే పేరు వచ్చింది. కాలక్రమంలో అది 'వాసర' గా మారి 'బాసర'గా స్థిరపడింది.

ఇక్కడి అమ్మవారి సైకత రూపం చెదిరి పోకుండా ఎప్పటికప్పుడు పసుపు మెత్తుతూ వుంటారు. పరీక్షల సమయంలో విద్యార్ధినీ విద్యార్ధులు అమ్మవారిని పెద్ద సంఖ్యలో దర్శించుకుని ఆ తల్లి అనుగ్రహాన్ని పొందుతూ వుంటారు. 'వ్యాస పౌర్ణమి ... దసరా నవరాత్రులు ... శ్రీ పంచమి రోజున ఇక్కడ విశేష పూజలు నిర్వహిస్తుంటారు.


More Bhakti News