నాగపంచమి

ప్రాచీన కాలం నుంచి కూడా పాములను దేవతలుగా భావించి పూజించే సంప్రదాయం వుంది. ఇక శ్రావణ మాసపు శుక్ల పంచమి (నాగపంచమి ) రోజున చేసిన నాగారాధన విశేషమైన రీతిలో పుణ్య ఫలాలను ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. చతుర్ది రోజున ఉపవాసం ఉండి పంచమి రోజున ఉదయాన్నే వెండితోగానీ ... కర్రతోగానీ ... మట్టితో గాని అయిదు పడగలు గల పామును తయారు చేసుకోవాలి. పాము ప్రతిమకు పంచామృతాలతో అభిషేకం చేసి పూవులతో పూజించాలి. ఆ తరువాత పాలు ... పాయసం నివేదన చేయాలి. వీలైతే పుట్ట దగ్గరికి వెళ్లి దీపారాధన చేసి పాలుపోసి రావచ్చును.

ఇక ఈ పండుగ వెనుక నాగుపాము తన భక్తులను కాపాడుతుందనే కథ కూడా ఒకటి వినిపిస్తోంది. పూర్వం ఒక రైతు తెల్లవారితే నాగపంచమి అనగా తన పొలాన్ని దున్ని ఇంటికి వచ్చేశాడు. అతను పొలం దున్నుతుండగా ఓ కలుగులో వున్న నాగుపాము పిల్లలు చనిపోయాయి. ఈ విషయం తెలియని అతను ... కుటుంబ సభ్యులు ఆదమరిచి నిద్రపోయారు. పగబట్టిన నాగుపాము తెల్లవారుతుండగా ఆ ఇంట్లోకి ప్రవేశించి నిద్రిస్తున్న వారినందరినీ కాటువేసింది.

అయితే ఆ సమయంలో అక్కడ ఆ రైతు కూతురు లేకపోవడం చూసి, ఆమెను కూడా కాటువేయాలనే ఉద్దేశంతో వెదకడం మొదలు పెట్టింది. ఆ రోజున 'నాగ పంచమి' కావడంతో ఆ ఇంటికి కాస్త దూరంలో వున్న పుట్ట దగ్గర ఆమె నాగదేవతను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించడం చూసింది. తన భక్తురాలి కుటుంబాన్ని తొందరపాటుతో కాటు వేసినందుకు ఆ పాము పశ్చత్తాపపడింది. వెంటనే రైతు ఇంటికి తిరిగివెళ్లి తను కాటు వేసిన చోట నుంచి ఆ విషాన్ని వెనక్కి తీసుకుని వెళ్లిపోయింది.

రైతు కుటుంబ సభ్యులు కాస్త నలతగానే మేల్కొన్నప్పటికీ ఆ తరువాత పూర్తి ఆరోగ్య వంతులై ఆనందకరమైన జీవితాన్ని కొనసాగించారట. ఈ కథను భక్తులు నేటికీ విశ్వసిస్తుంటారు ... అందువల్లనే ఈ రోజున భూమిని దున్నడం ... చెట్లు కొట్టడం ... పుట్టలు పడదోయడం వంటి పనులు చేయరు. ఇక నాగదేవతను ఆరాధించడం వలన అనేక దోషాల నుంచి ... వ్యాధుల నుంచి విముక్తి కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.


More Bhakti News