శ్రీ లక్ష్మీ నారాయణుల నోము

సమస్యల సుడిగుండాలు చుట్టుముడుతున్నప్పుడు వాటి బారి నుంచి స్త్రీలను బయటపడేసే అభయ హస్తాలే నోములని చెప్పవచ్చు. అలాంటి నోములలో ఉత్తమమైనదిగా చెప్పబడుతోంది 'శ్రీ లక్ష్మీ నారాయణుల నోము'. ప్రతి ఏకాదశినాడు ఉపవాసం ఉంటూ ద్వాదశి రోజున శ్రీ లక్ష్మీ నారాయణులను పూజించి బ్రాహ్మణ దంపతులకు భోజనం పెట్టి ... దక్షిణ తాంబూలాలతో సంతృప్తి పరచాలి. అలా ఏడాది పోవునా అంటే 24 ఏకాదశుల పాటు ఈ నోమును నోచుకోవాలి. ఆ తరువాత ఇంట్లో మంటపాన్ని ఏర్పాటు చేసుకుని అందులో లక్ష్మీనారాయణుల వెండి విగ్రహాల నుంచి పూజించి, మంటపంతో సహా దానమివ్వాలి.

ఇక ఈ నోము నోచుకోవడానికి కారణమైన కథలోకి వెళితే ... వేదపండితుడైన ఓ బ్రాహ్మణుడి భార్య ఓ మగబిడ్డను ప్రసవించి కన్నుమూసింది. ఆ బిడ్డ ఆలనాపాలన చూడటం కోసం ఆ బ్రాహ్మణుడు రెండో పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలం గడిచాక ఆ బ్రాహ్మణుడు కాలం చేశాడు. కాలక్రమంలో ఆ బ్రాహ్మణుడి కొడుకు ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. అయితే తన వైవాహిక జీవితం సక్రమంగా సాగకపోవడం వలన, కొడుకు - కోడలు సంతోషంగా ఉండటాన్ని ఆ బ్రాహ్మణుడి రెండో భార్య చూడలేకపోయింది. ఈ కారణంగా కొత్తగా కాపురానికి వచ్చిన అమ్మాయిని ఆమె నానా కష్టాలు పెట్టసాగింది.

ఆ బాధలను తట్టుకోలేక పోయిన ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఓ రోజు రాత్రి ఆమె నదిలో దూకాలనే ఉద్దేశంతో అక్కడికి వెళ్లగా కొందరు దేవతా స్త్రీలు తారసపడ్డారు. ఆ యువతి ప్రయత్నాన్ని అడ్డుకుని ఆమెకి వచ్చిన కష్టం గురించి తెలుసుకున్నారు. క్రితం జన్మలో ఆమె శ్రీ లక్ష్మీనారాయణుల నోము మధ్యలో ఆపేసిన కారణంగానే ఆమె వైవాహిక జీవితం సవ్యంగా లేదని చెప్పారు. శ్రీ లక్ష్మీ నారాయణుల నోము నోచుకోమంటూ విధి విధానాలను వివరించారు.

దాంతో ఇంటికి తిరిగి వచ్చిన ఆ యువతి, వారు చెప్పినట్టుగానే ఈ నోము నోచింది. ఫలితంగా అత్తగారి మనసు మంచిగా మారిపోయి, ఆమెను ఆప్యాయంగా చూసుకోవడం మొదలు పెట్టింది.


More Bhakti News