అదే పరమశివుడి లీలావిశేషం !

ఆదిదేవుడు స్వయంభువుగా ఆవిర్భవించిన ఒక్కో పుణ్యక్షేత్రం వెనుక ఒక్కో ఆసక్తికరమైన కథనం వినిపిస్తూ వుంటుంది. ఆ కథనాలు స్వామి లీలావిశేషాలను ఆవిష్కరిస్తూ, ఆయన అక్కడ ప్రత్యక్షంగా కొలువై వున్నాడనే విషయాన్ని స్పష్టం చేస్తుంటాయి. ఈ నేపథ్యంలో కొన్ని శైవక్షేత్రాలలో గల శివలింగాలపై వివిధ రకాల ముద్రలు కనిపిస్తూ వుంటాయి. అలా 'గోవు పాదం' యొక్క ముద్రను కలిగిన శివలింగం కర్నూలు జిల్లా 'మహానంది' లో కనిపిస్తుంది.

శివలింగంపై గోవు పాదముద్ర వుండటానికి గల కారణంగా ఒక ఆసక్తికరమైన కథనం వినిపిస్తుంది. అనునిత్యం ఒక గోవు మేతకోసం వచ్చినప్పుడు ఇక్కడి పుట్టలో పాలధారలు వదిలేది. పశువుల కాపరి ద్వారా ఈ విషయం తెలుసుకున్న రాజుగారు, ఈ విచిత్రాన్ని చూడటం కోసం రహస్యంగా గోవును అనుసరిస్తాడు. పుట్టలో పాలధారలు విడుస్తోన్న సమయంలో రాజు అలికిడి చేయడంతో, ఆవు బెదిరి పుట్టపై కాలుపెడుతుంది.

ఊహించని ఈ సంఘటనని రాజు నివ్వెరపోయి చూస్తుండగా, ఆ పుట్ట శివలింగాకృతిని సంతరించుకుంటుంది. పుట్టపై పడిన గోవు పాదముద్ర శివలింగంపై కూడా అలాగే ఉండిపోతుంది. ఆ తరువాత ఆ రాజు స్వామివారికి ఆలయాన్ని నిర్మించినట్టు చెబుతుంటారు. సాధారణంగా ఇలా పుట్టలో వుండి ఆవుపాలను స్వీకరిస్తూ స్వామివారు వెలుగుచూసిన తీరు వేంకటేశ్వరస్వామి క్షేత్రాల్లో ఎక్కువగా వినిపిస్తూ వుంటుంది. ఈ క్షేత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన కథనాల్లో ఒకటి, అలాంటి కథనానికి దగ్గర వుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తూ వుంటుంది.


More Bhakti News