శక్తిగణపతి ఆరాధనా ఫలితం

ఒకవైపున దేవతలు ... మరోవైపున మహర్షుల చేత అనినుత్యం పూజించబడే గణపతి, సాధారణ మానవులను సైతం అదే విధంగా అనుగ్రహిస్తూ వుంటాడు. ఆయనలో ఆగ్రహం ... తొందరపాటుతనం అస్సలు కనిపించవు. చిన్నపిల్లల సేవలను సైతం సంతోషంగా స్వీకరిస్తూ, కుడుములు ... ఉండ్రాళ్లు నైవేద్యంగా సమర్పిస్తేచాలు ఆనందంతో పొంగిపోయే అల్పసంతోషిగా ఆయన కనిపిస్తుంటాడు.

ఏ శుభాకార్యాన్ని తలపెడుతూ ఆయనకి ఒక మాటచెప్పినా, అది పూర్తయ్యేంత వరకూ ఆయన తన అనుగ్రహాన్ని అందిస్తుంటాడు. కరుణతో కరిగిపోయే గణపతి వివిధ నామాలతో ... ముద్రలతో దర్శనమిస్తుంటాడు. అలాంటి విశిష్ట వినాయక రూపాలలో ఒకటిగా 'శక్తిగణపతి' దర్శనమిస్తుంటాడు. శక్తిగణపతి పేరుకి తగినట్టుగానే కార్యసిద్ధికి అవసరమైన శక్తిని ప్రసాదిస్తాడు. తనని ఆరాధించడం వలన ఎంతటి కష్టసాధ్యమైన కార్యం నుంచైనా విజయం లభించేలా చేస్తాడు.

ఒకానొక సందర్భంలో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు శక్తిగణపతిని పూజించినట్టు ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. శ్రీమహావిష్ణువు యోగనిద్రలో ఉన్నప్పుడు ఆయన చెవుల నుంచి 'మధుకైటభులు' ఉద్భవిస్తారు. వాళ్లు బ్రహ్మదేవుడిని నానావిధాలుగా బాధిస్తూ ఉండటంతో ఆయన తట్టుకోలేకపోతాడు. విష్ణుమూర్తిని విడిచి వెళ్లవలసిందిగా ఆయన యోగనిద్రను కోరిన కారణంగా ఆ స్వామికి మెలకువ వస్తుంది.

బ్రహ్మదేవుడి అభ్యర్థనను ఆలకించిన శ్రీమహావిష్ణువు మధుకైటభులను అంతం చేయడానికి సిద్ధపడతాడు. అయితే అది అంతతేలిక కాదని గ్రహించి 'శక్తిగణపతి'ని పూజిస్తాడు. శక్తిగణపతి ఆరాధనా ఫలితంగా ఆయన మధుకైటభులను సంహరిస్తాడు. అందువలన అనునిత్యం శక్తిగణపతిని ఆరాధిస్తూ వుండాలి. తలపెట్టినకార్యాల్లో విజయాన్ని సొంతం చేసుకుంటూ వుండాలి.


More Bhakti News