Dubai: దుబాయ్‌లో ప్ర‌పంచంలోనే అతిపెద్ద విమానాశ్ర‌యం నిర్మాణం.. ప్ర‌త్యేక‌త‌లు ఏమిటంటే..!

  • 'ఎక్స్' వేదిక‌గా దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్ర‌క‌ట‌న
  • అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం పేరిట ప్ర‌పంచంలోనే అతిపెద్ద ఎయిర్‌పోర్టు
  • ఈ ప్రాజెక్ట్ కోసం ఏకంగా రూ. 2.9ల‌క్ష‌ల కోట్లు ఖ‌ర్చు చేస్తున్న దుబాయ్‌
  • ఏడాదికి 260 మిలియన్ల మంది రాక‌పోక‌లు కొన‌సాగించేలా విమానాశ్ర‌య నిర్మాణం
  • 400 టెర్మినల్ గేట్లు, ఐదు స‌మాంత‌ర‌ రన్‌వేలు ఈ విమానాశ్రయం సొంతం
Dubai Al Maktoum International Airport to be world largest with 400 Gates

దుబాయ్‌లో ప్ర‌పంచంలోనే అతిపెద్ద విమానాశ్ర‌యం నిర్మాణం కానుంది. ఈ మేర‌కు దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆదివారం ఎక్స్ వేదిక‌గా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఈ ఎయిర్‌పోర్టును అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయంగా పిల‌వ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఏకంగా 34.85 బిలియన్ డాల‌ర్లు వెచ్చిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. అంటే భార‌తీయ క‌రెన్సీలో రూ. 2.9ల‌క్ష‌ల కోట్లు అన్న‌మాట‌. ప‌దేళ్ల‌లో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాల‌ని దుబాయ్ అధికారులు ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. 

ఏడాదికి 260 మిలియన్ల మంది రాక‌పోక‌లు కొన‌సాగించేలా ఈ విమానాశ్ర‌యాన్ని నిర్మిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. ఇక అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్ర‌స్తుత‌ దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కంటే ఐదు రెట్లు పెద్దదిగా ఉంటుందని ఆయన చెప్పారు. రాబోయే సంవత్సరాల్లో దుబాయ్ ఎయిర్‌పోర్టు నుండి అన్ని కార్యకలాపాలు అల్ మక్తూమ్‌కు బదిలీ చేయడం జ‌రుగుతుంద‌న్నారు.

400 టెర్మినల్ గేట్లు, ఐదు స‌మాంత‌ర‌ రన్‌వేలు ఈ విమానాశ్రయం సొంతం. ఈ ఎయిర్‌పోర్టు ఫ్లాగ్‌షిప్ క్యారియర్ ఎమిరేట్స్, లోబడ్జెట్‌ విమానయాన సంస్థ ఫ్లైదుబాయ్‌తో పాటు ప్రపంచాన్ని దుబాయ్‌కి, బయటికి కనెక్ట్ చేసే అన్ని ఎయిర్‌లైన్ భాగస్వాములకు కొత్త డెస్టినేష‌న్‌ కానుందని దుబాయ్ ప్రభుత్వ ఎయిర్‌లైన్ ఎమిరేట్స్ చైర్మన్ షేక్ అహ్మద్ బిన్ సయీద్ అల్-మక్తూమ్ వెల్ల‌డించారు. ఈ నిర్మాణం "ప్రపంచ వేదికపై ప్రముఖ ఏవియేషన్ హబ్‌గా దుబాయ్ స్థానాన్ని మరింత పటిష్ఠం చేస్తుంది" అని దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ సీఈఓ పాల్ గ్రిఫిత్స్ దుబాయ్ మీడియాతో అన్నారు.

"అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలోనే అతి ఎక్కువ మంది రాక‌పోక‌లు కొన‌సాగించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఏడాదికి దాదాపు 260 మిలియన్ల మంది ప్రయాణీకులు ఈ ఎయిర్‌పోర్టు ద్వారా ప్ర‌యాణాలు కొన‌సాగించ‌వ‌చ్చు. ఇది ప్రస్తుత దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం కంటే ఐదు రెట్లు అధికం. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అన్ని కార్యకలాపాలు రాబోయే సంవత్సరాల్లో దీనికి బదిలీ అవుతాయి. విమానాశ్రయం 400 ఎయిర్‌క్రాఫ్ట్ గేట్‌లు, ఐదు సమాంతర రన్‌వేలను కలిగి ఉంటుంది. ఏవియేషన్ రంగంలో తొలిసారిగా కొత్త ఏవియేషన్ టెక్నాలజీలు ఉపయోగించబడతాయి” అని అల్ మక్తూమ్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

More Telugu News