విష్ణుమూర్తి అనుగ్రహాన్ని అందించే ధనుర్మాసం

ధనుర్మాసం అనే పేరే ఎంతో పవిత్రమైనదిగా అనిపిస్తూ ఉంటుంది. ఈ కాలమంతా కూడా ఆ పవిత్రత కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది. వైష్ణవ సంప్రదాయం ప్రకారం ఈ కాలంలో శ్రీమహావిష్ణువుకు ప్రత్యేక పూజలు ... సేవలు జరుగుతుంటాయి.

చలిలో .. వేకువ జామునే నిద్రలేచి నదీస్నానం చేసే భక్తులు .. గుడిలో నుంచి వినిపించే 'తిరుప్పావై' .. గుడిగంటల శబ్దాలు .. వివిధ రకాల పూలతో స్వామివారికీ .. అమ్మవారికిచేసే అలంకారాలు .. వేడివేడిగా స్వామివారికి నైవేద్యంగా సమర్పించిన ధద్యోదనం .. చక్రపొంగలి భక్తులకు ప్రసాదంగా పంచుతూ ఉండటం .. వాళ్లు స్వామివారి మంటపంలో కూర్చుని ప్రసాదాలు స్వీకరిస్తుండటం ఒక మనోహరమైన వాతావరణాన్ని ఆవిష్కరిస్తూ ఉంటుంది.

సూర్యభగవానుడు ప్రతి మాసంలోను ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తుంటాడు. దీనినే సంక్రమణమని అంటారు. అలా సూర్యభగవానుడు వృచ్చిక రాశి నుంచి ధనుస్సు రాశిలోకి ప్రవేశించడాన్ని ధనుస్సంక్రమణంగా చెబుతుంటారు. ధనుస్సంక్రమణం నుంచి మకర సంక్రమణం వరకు అంటే, సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించేంత వరకూ గల కాలాన్ని 'ధనుర్మాసం' గా చెబుతారు.

తన పాశురాలతో రంగనాథస్వామి మనసు దోచుకున్న 'గోదాదేవి' ఈ మాసంలోనే ఆయనని వివాహమాడిందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అందువలన గోదాదేవి రచించిన పాశురాలను ఈ మాసంలోని ప్రతిరోజు స్వామివారి సన్నిధిలో వైష్ణవ స్వాములు గానం చేస్తుంటారు. ఈ మాసంలో ప్రతినిత్యం స్వామివారిని దర్శించడం వలన ... పూజించడం వలన ... ఆయన నామస్మరణ చేయడం వలన, ధద్యోదనం .. చక్రపొంగలి వంటి నైవేద్యాలను స్వామివారికి సమర్పించడం వలన ... ఆలయంలో ఆ ప్రసాదాలను స్వీకరించడం వలన సకలశుభాలు చేకూరతాయని చెప్పబడుతోంది.


More Bhakti News