దయకలిగిన దేవుడు దత్తాత్రేయుడు

కార్తవీర్యార్జునుడు బలహీనమైన చేతులతో జన్మిస్తాడు. ఊహతెలిసిన నాటి నుంచి ఆయన తన అశక్తిని తలచుకుని కుమిలిపోతుంటాడు. యువరాజుగా సింహాసనాన్ని అధిష్ఠించే అవకాశం కూడా ఉండటంతో ఆయన ఆవేదన మరింత ఎక్కువవుతుంది.

ఇలాంటి పరిస్థితుల్లోనే ఆయన దత్తాత్రేయస్వామిని అనఘాదేవి సమేతంగా ఆరాధిస్తాడు. స్వామి అనుగ్రహంతో వెయ్యి చేతులను పొందుతాడు. సహస్ర బాహువులను పొందిన ఆయన పరాక్రమానికి తిరుగులేకుండా పోతుంది. ఎలాంటి సంశయం లేకుండా ఆయన సింహాసనాన్ని అధిష్ఠించి రాజ్యపాలన చేస్తుంటాడు.

అలాంటి కార్తవీర్యార్జునుడు ... 'కామధేనువు' కోసం జమదగ్ని మహర్షిని హతమారుస్తాడు. కామధేనువును అపహరించుకుని వెళతాడు. తన తండ్రి మరణానికి కారకుడైనందుకు ... తాము అనునిత్యం పూజించే గోమాతను బలవంతంగా ఈడ్చుకుంటూ వెళ్లినందుకు కార్తవీర్యార్జునుడిని పరశురాముడు సంహరిస్తాడు. అధర్మానికి పాల్పడిన కారణంగా దత్తాత్రేయుడు ప్రసాదించిన సహస్ర బాహువుల శక్తి కార్తవీర్యార్జునుడిని కాపాడలేకపోతుంది.

ఆవేశంతో ఆయనతో పాటు అనేకమంది క్షత్రియులను సంహరించిన పరశురాముడు తిరిగి మనశ్శాంతి కోసం దత్తాత్రేయస్వామినే ఆశ్రయిస్తాడు. అప్పడు దత్తాత్రేయుడు ఆయనని ఆప్యాయంగా ఆదరించి జ్ఞానోపదేశం చేస్తాడు. ఫలితంగా పరశురాముడు శాంతాన్ని పొంది తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్లిపోతాడు. ఇలా దత్తాత్రేయస్వామి ఎంతోమందిని అనుగ్రహించాడు ... మరెంతో మందిని జ్ఞాన మార్గంలో నడిపించాడు. అలాంటి దత్తాత్రేయస్వామిని ఆయన జయంతి రోజున పూజించడం వలన సకలశుభాలు చేకూరతాయని చెప్పబడుతోంది.


More Bhakti News