నాగారాధన

శ్రీ మహా విష్ణువు శేష తల్పంపై పవళిస్తుంటాడు ... సదాశివుడు మెడలో పామును ధరించి సంచరిస్తుంటాడు. ఇక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సాక్షాత్తు పాము రూపంలో ఉండేవాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ కారణంగా భారతీయుల ఆధ్యాత్మిక జీవితంలో పాము కూడా దైవంగా పూజించబడుతోంది ... 'నాగదేవత'గా ఆరాధించబడుతోంది.

ముఖ్యంగా 'నాగపంచమి' ...'నాగులచవితి'ని పర్వదినాలుగా భావించి, ఆ రోజుల్లో విశేష పూజలు చేయడం జరుగుతుంటుంది. ఈ పర్వదినాల్లో పుట్ట దగ్గరికి వెళ్లి పాలు పోసి వడపప్పు - బెల్లం నైవేద్యంగా సమర్పించడం ఆచారంగా వస్తోంది. అయితే పురాణ గాధలలో నుంచి పుట్టుకొచ్చిన ఈ ఆచారం వెనుక మరో అర్ధం లేకపోలేదు.

సాధారణంగా పాములు పొలాల్లోని కలుగుల్లో నివసిస్తూ వుంటాయి. ఇవి పంటకి హాని కలిగించే పురుగులను ... ఎలుకలను ఆహారంగా తీసుకుంటూ రైతులకు మేలు చేస్తుంటాయి. అలాంటి పాములు మనుషులు కనబడగానే కంగారుపడిపోయి తమని ఏవైనా చేస్తారేమోననే భయం కారణంగానే అవి కాటు వేస్తుంటాయి. ఇక మనుషులు కూడా అవి తమని కాటు వేస్తాయేమోననే భయంతోనే వాటిని చంపేస్తుంటారు.

ఇలా మనిషి పట్ల పాములకి ... పాములపట్ల మనిషికి ఉన్న భయాన్ని పోగొట్టడం కోసం ... పాముల జాతిని కాపాడుకోవడం కోసం పెద్దలు భక్తి మార్గాన్ని ఎంచుకున్నారని తెలుస్తోంది. మానవుల మనుగడకు ఎంతగానో ఉపయోగపడే పాములు నశించిపోకుండా చేయడమే ఈ ఆచారం వెనుక దాగిన అర్థంగా కనిపిస్తుంది.


More Bhakti News