దాసగణు కోరిక నెరవేర్చిన బాబా !

సాయిబాబాకు అత్యంత సన్నిహితులలో దాసగణు ఒకడు. బాబా సాక్షాత్తు భగవంతుడి స్వరూపమని ఆయన భావించేవాడు. అనునిత్యం బాబాను దర్శించుకుంటూ ఆయనని సేవిస్తూ ఉండేవాడు. ఒకసారి బాబాను దర్శించుకున్న కొంతమంది భక్తులు ఆయనకి తమ కష్టనష్టాలను చెప్పుకుంటూ వుంటారు. అదే సమయంలో దాసగణు అక్కడికి వస్తాడు.

గంగ - యమునల సంగమం చూడాలనే కోరిక తనకి చాలాకాలంగా వుందని బాబాతో దాసగణు చెబుతాడు. ఆ పవిత్ర ప్రదేశాన్ని చూసి వెంటనే వచ్చేస్తానని అంటాడు. గంగా యమునల సంగమ స్థానాన్ని దర్శించాలనే ఆయన ఆరాటాన్ని బాబా అర్థం చేసుకుంటాడు. అయితే అతను అక్కడికి వెళ్లడం ... తిరిగి రావడం శ్రమతో కూడుకున్నదని అంటాడు. బాబా అనుగ్రహం తోడుగా వుంటుంది కాబట్టి తనకి అంత కష్టంగా అనిపించదనీ, ఆశీర్వదించి పంపించమని పాదాలకు నమస్కరిస్తాడు.

అంతే బాబా పాదాలు మోపిన ప్రదేశం నుంచి గంగా యమునలు జంట ధారలుగా పైకి పొంగుకొస్తాయి. ఆ దృశ్యం చూసిన వాళ్లంతా ఆనందాశ్చర్యాలకి లోనవుతారు. దాసగణు ఆ పాదతీర్థాన్ని తలపై చల్లుకుని తన జన్మ ధన్యమైందని అంటాడు. అలా తనని విశ్వసించిన భక్తుల కోసం గంగా యమునలను సైతం అక్కడికి రప్పించిన అవతార పురుషుడుగా బాబా కనిపిస్తాడు. ఆయన అనుగ్రహముంటే అసాధ్యమైనదేదీ లేదనిపిస్తాడు.


More Bhakti News