నవరాత్రుల్లో ఇది ఎంతో పుణ్యప్రదమట !

ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకూ గల తొమ్మిది రోజులను దేవీ నవరాత్రులుగా చెబుతుంటారు. సూర్యోదయ సమయానికి అమావాస్య లేని రోజున శరన్నవరాత్రులను ఆరంభిస్తూ ఉంటారు. ఈ తొమ్మిది రోజులలో ఒక్కోరోజున ఒక్కో దుర్గా రూపాన్ని కొలుస్తుంటారు. ఇలా ఈ తొమ్మిది రోజుల పాటు నవదుర్గలు అంగరంగ వైభవంగా పూజలు అందుకోవడం జరుగుతుంది.

అనారోగ్యాల వలన ... ఆర్ధికపరమైన ఇబ్బందుల వలన ... అపజయాల వలన కలిగే దుఃఖాలను దుర్గాదేవి నివారిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అంతే కాదు తనని విశ్వసించేవారి సంతాన సౌభాగ్యాలను అమ్మవారు రక్షిస్తూ ఉంటుంది. అందువలన అందరూ అమ్మవారి అనుగ్రహాన్ని ఆశిస్తూ , ఈ నవరాత్రులలో ఆ తల్లిని మరింత భక్తి శ్రద్ధలతో దర్శిస్తూ వుంటారు. ఈ కారణంగానే అమ్మవారు కొలువుదీరిన ప్రతి ఆలయం సందడిగా కనిపిస్తూ ఉంటుంది.

స్త్రీ జీవితం దశలవారీగా పరిపూర్ణతను సాధించడం వెనుక అమ్మవారి అనుగ్రహం తప్పనిసరిగా ఉంటుంది. అందువల్లనే ఈ నవరాత్రులలో 'కుమారీ పూజ' ... 'సువాసినీ పూజ' ... 'దంపతి పూజలు'లు జరుపుతుంటారు. నవరాత్రులలో అమ్మవారిని పూజించిన వాళ్లు ముత్తయిదువులను ఆహ్వానించి, తమ స్తోమతను బట్టి చీర ... రవికల గుడ్డతో పాటు, పండు ... తాంబూలం సమర్పించవలసి ఉంటుంది. ఈ విధంగా చేయడం ఎంతో పుణ్యప్రదమని శాస్త్రం చెబుతోంది.


More Bhakti News