కుజదోష నివారణకి దర్శించవలసిన ఆలయం

గ్రహ సంబంధమైన దోషాలలో శనిదోషం తరువాత ఆ స్థాయిలో బాధితులను ఆందోళనకి గురిచేసేదిగా 'కుజదోషం' కనిపిస్తుంది. ఎందుకంటే కుజదోష ప్రభావం వలన ఎదురయ్యే సమస్యలు అలా వుంటాయి. అందువలన కుజుడిని శాంతింపజేసి ఆయన అనుగ్రహాన్ని పొందడానికిగాను ఎవరికి తెలిసిన ప్రయత్నం వాళ్లు చేస్తుంటారు.

సాధారణంగా నవగ్రహాలు ఆలయాల్లో ఒక భాగంగా కొలువై కనిపిస్తుంటాయి. ఏ గ్రహానికి సంబంధించిన ఆలయం ఆ గ్రహానికి ప్రత్యేకంగా వుండే అవకాశాలు చాలా అరుదనే చెప్పాలి. అందువలన కుజుడిని పూజించాలనుకునే వాళ్లు ఆయన ప్రత్యేక ఆలయాన్ని దర్శించే అవకాశం లేదనే అనుకుంటారు. అలాంటి వారికి ఆశాకిరణంలా 'ఉజ్జయిని' క్షేత్రం దర్శనమిస్తూ వుంటుంది.

ఉజ్జయిని అనగానే అందరికీ 'మహాకాళేశ్వరుడు' గుర్తుకు వస్తాడు. ఈ క్షేత్రంలోనే 'కుజుడు' కూడా కొలువై దర్శనమిస్తూ వుంటాడు. ఇక్కడ ఈయనని 'మంగళనాథుడు' పేరుతో కొలుస్తుంటారు. ప్రాచీనకాలంలో కుజుడి యొక్క కదలికలను ఈ ప్రదేశం నుంచి గమనించేవారట. అందువలన ఇక్కడ కుజుడికి ఆలయం నిర్మించడం జరిగిందని చెబుతుంటారు.

ఎంతోమంది ఇక్కడి కుజుడిని దర్శించి ... పూజించి ఆయన అనుగ్రహాన్ని పొందారట. అందువలన కుజ దోషంతో బాధలు పడుతున్నవాళ్లు ఇక్కడి మంగళనాథుడిని దర్శిస్తూ వుంటారు. అత్యంత భక్తిశ్రద్ధలతో ఆయనని సేవిస్తూ దోష ప్రభావం నుంచి బయటపడుతూ వుంటారు.


More Bhakti News