ఉన్నతమైన జీవితమే ఉత్తమ ఫలితాన్నిస్తుంది

పిల్లలకు ... ఈ ప్రపంచంలో తొలిసారిగా పరిచయమయ్యేది తల్లిదండ్రులే. వాళ్ల కదలికలను పిల్లలు చాలా శ్రద్ధగా గమనిస్తూ వుంటారు. వారి అలవాట్లను ... అభిరుచులను గ్రహిస్తూ వుంటారు. తల్లిదండ్రులు నడచుకునే తీరును పరిశీలిస్తూ, ఆ విధంగా చేయడమే సరైనదనుకుని అనుసరిస్తూ వుంటారు. కొంతమంది పిల్లలు తమ తల్లిదండ్రులను అనుకరించడమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

పిల్లలు తమని అనుసరిస్తూ ఉన్నారనే విషయాన్ని ఇక్కడే తల్లిదండ్రులు గ్రహించవలసి వుంటుంది. తమ పిల్లల ఎదుట మరింత ఉన్నతంగా వ్యవహరించవలసి వుంటుంది. తల్లిదండ్రులు ... ఇంట్లో ప్రశాంతమైన ... ఆధ్యాత్మిక పరమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలి. ఇంటికి వచ్చిన పెద్దలను గౌరవిస్తూ వుండాలి. బంధుమిత్రుల పట్ల ఆత్మీయ భావాన్ని ఆవిష్కరించాలి. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి అడుగుముందుకు వేయాలి.

దైవకార్యాల పట్ల ఆసక్తిని చూపుతూ, చేతనైన సాయాన్ని అందిస్తూ వుండాలి. ఆధ్యాత్మిక గ్రంధాలను ... ఉత్తమ సాహిత్యం గల పుస్తకాలను చదువుతూ వుండాలి. వృత్తి పట్ల అసంతృప్తినీ ... అసహనాన్ని ప్రదర్శించకుండా అంకితభావాన్ని కలిగి వుండాలి. భగవంతుడి అనుగ్రహమే తప్ప తాము ఏ రకంగాను గొప్పకాదన్నట్టుగా నడచుకోవాలి.

ఈ విధంగా నియమబద్ధమైన జీవితాన్ని కొనసాగిస్తూపోతే, పెద్దవాళ్లు ఎవరైనా ఎదురుపడినప్పుడు వాళ్లకి నమస్కరించమని వాళ్ల ముందే పిల్లలకి కొత్తగా చెప్పవలసిన అవసరం లేకుండా పోతుంది. వాళ్లు ఈ విధమైన వాతావరణానికి ... పద్ధతులకు సహజంగానే అలవాటుపడిపోతారు. పిల్లలు ... పెద్దలను అద్దంగా భావిస్తూ, అందులో తమని తాము చూసుకుంటూ వుంటారు. వాళ్లు నడుస్తోన్న మార్గంలోనే తమ ప్రయాణాన్ని ప్రారంభిస్తుంటారు.

అందువలన తల్లిదండ్రులు ఆదర్శవంతమైన భావాలతో అందమైన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించగలగాలి. దాంతో ఇక పిల్లలను ప్రత్యేకించి తీర్చిదిద్దవలసిన అవసరం లేకుండా పోతుంది. ఉన్నతమైన జీవితమే ఉత్తమమైన ఫలితాలను ఇవ్వగలదనే విషయం అందరికీ అర్థమైపోతుంది.


More Bhakti News