భక్తిని దానం చేయడం కుదురుతుందా ?

భక్తిని దానం చేయడం కుదురుతుందా ? అంటే కుదురుతుందని చాటిచెప్పాడు అంబరీషుడు. ఒకవేళ కుదిరినా .. భగవంతుడి అనుగ్రహాన్ని ప్రసాదించే భక్తిని దానం చేయడానికి ఎవరైనా అంగీకరిస్తారా ? అంటే ఇచ్చిన మాటకు కట్టుబడి ఆ పనిని తాను చేసి నిరూపించాడు. ఏ భక్తితో అయితే శ్రీమన్నారాయణుడికి చేరువయ్యాడో, ఆ భక్తిని ఇతరులకు ధారపోయడానికి వెనుకాడలేదు.

అసలు విషయానికి వస్తే, మహాభక్తుడైన అంబరీషుడిని దూర్వాస మహాముని ఇచ్చిన శాపం ఏ విధంగాను ప్రభావితం చేయలేకపోతుంది. దాంతో ఆయన తీవ్రమైన ఆగ్రహావేశాలకు లోనవుతాడు. అంబరీషుడిపై తన శాపం పనిచేయకపోవడానికి కారణం అసమానమైన ఆయన భక్తి ధర్మాలని తెలుసుకుంటాడు. భక్తి ధర్మాలను అంబరీషుడు వదిలేసినప్పుడే శక్తిహీనుడు అవుతాడనీ, అప్పటి వరకూ ఆయనని తన తపోశక్తి ఏమీ చేయలేదని గ్రహిస్తాడు.

వెంటనే అమరలోక అధిపతి అయిన దేవేంద్రుడిని కలుసుకుని, అంబరీషుడి పట్ల తనకి గల ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తాడు. అంబరీషుడిని సదా రక్షిస్తూ వస్తోన్న భక్తి ధర్మాలకు ఆయనని దూరం చేయవలసిందిగా కోరతాడు. దాంతో దేవేంద్రుడు బ్రాహ్మణుడి వేషంలో అంబరీషుడి ఆశ్రమానికి వెళతాడు. అసలు విషయం ముందుగా చెప్పకుండా ఆవేదన నటిస్తూ, సాయం చేసి తీరుతానంటూ అంబరీషుడి దగ్గర నుంచి మాట తీసుకుంటాడు.

బ్రహ్మ హత్యా పాతకం నుంచి తన తండ్రిని విముక్తిడిని చేయడం కోసం తాని ఒక యాగాన్ని తలపెట్టినట్టు ఆ బ్రాహ్మణుడు చెబుతాడు. అందుకు అవసరమైన భక్తి ధర్మాలు తన దగ్గర లేవనీ, వాటిని దానంగా అనుగ్రహించమని అంబరీషుడిని కోరతాడు. ఆ మాట వినగానే అంబరీషుడు మొదట నివ్వెరపోతాడు. శ్రీహరి దివ్యమంగళ రూపాన్ని కనులారా చూస్తున్నప్పుడు అనంతమైన అనుభూతిని అందించే భక్తికీ, శ్రీమన్నారాయణుడి మనసు గెలుచుకునేలా చేసిన ధర్మానికి దూరం కావలసి వస్తుండటాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతాడు.

హరి నామస్మరణకు ... ఆయన పాదాలకు దూరం చేసే భక్తి ధర్మాలను అడగడం కన్నా, తన ప్రాణాలను అడిగితే బాగుండేదని అనుకుంటాడు. ఇది కూడా ఆ శ్రీహరి పరీక్షగానే భావిస్తూ, తనలోని భక్తి ధర్మాలను బ్రాహ్మణుడి వేషంలో వున్న దేవేంద్రుడికి దానం చేస్తాడు. అలా ఇచ్చిన మాటకు కట్టుబడి మరోమారు తన ఔన్నత్యాన్ని చాటుకున్న అంబరీషుడిని చూసి, మారువేషంలో వున్న దేవేంద్రుడితో పాటు దేవతలంతా కూడా ఆశ్చర్యపోతారు.


More Bhakti News