భగవంతుడు చూపించిన నిధి

భగవంతుడు కొంతమందిని ప్రత్యక్షంగా అనుగ్రహిస్తూ ఉంటాడు. అలాంటి వాళ్లని చూసి తాము చేసిన పాపమేమిటో తెలియక చాలామంది సతమతమైపోతుంటారు. పూర్వజన్మలో ఆ భక్తుడికి ... భగవంతుడికి గల అనుబంధమే అందుకు కారణమని కొన్ని సంఘటనలు తెలియజెబుతూ వుంటాయి. అలాంటి చరిత్ర కలిగినవాడిగా మనకి 'కనకదాసు' కనిపిస్తాడు. కనకదాసు పూర్వనామం 'తిమ్మదాసు' ... విజయనగర ప్రభువుల కొలువులో ఆయన తండ్రి పనిచేస్తూ ఉండేవాడు.

వేంకటేశ్వరస్వామి అనుగ్రహంతోనే ఆయన జన్మిస్తాడు. తండ్రి ప్రోత్సాహంతో యుద్ధ విద్యలను నేర్చుకున్న తిమ్మదాసు, ఆడుతూ .. పాడుతూ కాలం గడుపుతుంటాడు. యవ్వనంలోకి అడుగుపెట్టిన తిమ్మదాసుకి ఒకరోజున ఒక కల వస్తుంది. కలలో ఆయనకి దర్శనమిచ్చిన వేంకటేశ్వరస్వామి, గత జన్మలో ఆయన తన భక్తుడనే విషయాన్ని తెలియజేస్తాడు. ఫలానా చోట తన విగ్రహముందనీ ... దానిని వెలికితీసి ప్రతిష్ఠించమని ఆదేశిస్తాడు.

తాను ఆ విగ్రహాన్ని బయటికి తీయగలననీ, అయితే ఆలయాన్ని నిర్మించే ఆర్ధికపరమైన శక్తిసామర్థ్యాలు తనకి లేవని చెబుతాడు తిమ్మదాసు. విగ్రహంతో పాటే నిధి కూడా అతనికి లభిస్తుందని చెప్పి, స్వామి అదృశ్యమవుతాడు. మరునాడు ఉదయాన్నే స్వామి చెప్పిన ఆనవాళ్ల ప్రకారం తవ్వకాలు జరుపుతాడు తిమ్మదాసు. ఆ ప్రదేశంలో స్వామివారి సుందరమైన విగ్రహంతో పాటు, బంగారం గల లంకెబిందెలు లభిస్తాయి.

జరిగిన సంఘటన గురించి ఆయన ఆ గ్రామస్తులందరికీ చెబుతాడు. ఆ రోజు నుంచే స్వామివారి ఆలయ నిర్మాణానికి కావసిన ఏర్పాట్లు చేయడం పెడతాడు. బంగారం లభించిన కారణంగా గ్రామస్తులందరూ తిమ్మదాసును ... 'కనకదాసు' గా పిలవడం మొదలుపెడతారు. అలా భక్తి మార్గంలో మొదటి అడుగువేసిన కనకదాసు, అంచెలంచలుగా భక్తిలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ తన జీవితాన్ని చరితార్థం చేసుకున్నాడు.


More Bhakti News