ఇక్కడ హనుమంతుడి విమానం చూడొచ్చు !

హనుమంతుడు గాలిలో ఎగరగలడు ... ఆకాశమార్గాన ఎంతదూరమైనా ప్రయాణించగలడు. అలా ఆయన గాలిలో రివ్వున దూసుకుపోయే చిత్రాలను చూసినప్పుడు, అందరికీ ఒక చిత్రమైన అనుభూతి కలుగుతుంది. ముఖ్యంగా చిన్న పిల్లలు ... అలా ఎగిరే శక్తి తమకి కూడా వుంటే బాగుండునని అనుకుంటూ వుంటారు. ఇక జానపద సినిమాల్లో, బండరాయిని వాహనంగా చేసుకుని కథానాయకుడు ఆకాశమార్గాన వెళ్లే దృశ్యం చిన్న పిల్లల నుంచి పెద్దలవరకూ ఆసక్తిని కలిగిస్తుంది.

విమానంలా ఎగిరే బండరాయిని సినిమాలో చూసి ఆశ్చర్యపోయే వాళ్లు, అలాంటి ఆకారం కలిగిన బండరాయి నిజంగా కనిపిస్తే ఇక ఆ ఆనందానికి హద్దులు వుండవు. అలా వినానంలా కనిపించే బండరాయి మనకి కర్ణాటక ప్రాంతంలో గల పంచముఖ ఆంజనేయస్వామి క్షేత్రంలో కనిపిస్తుంది. ఇక్కడ కొండపై ఒక బండరాయి ... విశాలమైన మరో బండరాయిని వేదికగా చేసుకుని వుంటుంది. పొడవుగా విమానంలా వుండే ఈ రాయి, పైకి ఎగరడానికి సిద్ధంగా ఉన్నట్టుగా అనిపిస్తూ, చూపరులను ఆకట్టుకుంటూ వుంటుంది.

సాక్షాత్తు రాఘవేంద్రస్వామివారు ఇక్కడ పంచముఖ హనుమను ఆరాధించాడు. అలాంటి ఈ క్షేత్రంలో హనుమంతుడు ప్రత్యక్షంగా కొలువుదీరి ఉన్నాడనీ, రాత్రి సమయాల్లో ఆయన ఈ విమానంపై విహరించి వస్తుంటాడని చెబుతుంటారు. దైవబలం గల వారికి ఈ రాయి .. విమానంలా కనిపిస్తూ ఉంటుందనీ, మిగతావారికి ఆ ఆకారం కలిగిన రాయిలానే కనిపిస్తూ ఉంటుందని విశ్వసిస్తుంటారు. హనుమంతుడి విమానంగా చెప్పబడుతోన్న ఈ బండరాయిని చూసిన వాళ్లు, ఆయన దానిని అధిరోహించి ఆకాశమార్గాన ప్రయాణం చేస్తున్నట్టుగా ఊహించుకుంటూ అనుభూతి చెందుతూ వుంటారు.


More Bhakti News