Daggubati Purandeswari: మోదీ స్ఫూర్తి, చంద్రబాబు యుక్తి, పవన్ శక్తి కలయిక అపూర్వం: పురందేశ్వరి

  • రాజమండ్రి వద్ద వేమగిరిలో కూటమి సభ
  • హాజరైన ప్రధాని మోదీ, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, నారా లోకేశ్
  • పేదలకు న్యాయం చేయాలనేదే మూడు పార్టీల సిద్ధాంతం అని పురందేశ్వరి వెల్లడి
Purandeswari speech in Rajahmundry rally

రాజమండ్రి రూరల్ వేమగిరిలో ఏర్పాటు చేసిన కూటమి సభకు ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి, జనసేనాని పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హాజరయ్యారు. 

ఈ సందర్భంగా పురందేశ్వరి ప్రసంగిస్తూ... రాజమండ్రి అనేక చారిత్రాత్మక ఘట్టాలకు సాక్షీభూతంగా నిలిచిందని అన్నారు. ఇవాళ మరో ఘట్టానికి సాక్షిగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఒక ప్రజా కంటకుడైన పాలకుడిని గద్దె దించడానికి ఇవాళ మూడు పార్టీల కలయిక చారిత్రక అవవసరంగా మారిందని పురందేశ్వరి స్పష్టం చేశారు. 

ఈ మూడు  పార్టీల కలయికలో మనకు స్పష్టంగా కనిపించేది నరేంద్ర మోదీ స్ఫూర్తి, చంద్రబాబు యుక్తి, పవన్ కల్యాణ్ శక్తి అని వివరించారు. గత ఐదేళ్లుగా ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని, అందుకే మూడు పార్టీలు కలిసి ముందుకు వచ్చాయని అన్నారు. 

'సబ్ కే సాత్ సబ్ కా వికాస్' అనేది బీజేపీ నినాదం అని, సమాజంలో అందరూ సర్వతోముఖాభివృద్ధి  సాధించాలనేది బీజేపీ లక్ష్యమని తెలిపారు. ఇక టీడీపీ ఆలోచనా విధానం విషయానికొస్తే... సమాజమే దేవాలయం పేదవాడే దేవుడు అనేది ఆ పార్టీ నినాదం అని వెల్లడించారు. సమాజంలోని పేదలకు, బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలనేది టీడీపీ ఆలోచన అని వివరించారు. 

జనసేన పార్టీని చూస్తే... సమాజంలో ఎవరైనా అన్యాయానికి గురైనట్లయితే వారి తరఫున నిలబడి ప్రశ్నిస్తాను అని సోదరుడు పవన్ కల్యాణ్ ముందుకొచ్చారని పురందేశ్వరి పేర్కొన్నారు. కనుక ఈ మూడు పార్టీలు ఒకే విధమైన ఆలోచనా విధానంతో ముందుకు వెళుతున్నాయని అన్నారు. ఇప్పటివరకు ప్రజలు అనుభవించిన కష్టాలను దూరం చేస్తూ, ఈ రాష్ట్రానికి సుపరిపాలన అందిస్తూ, రాష్ట్ర అభివృద్ధికి ఈ కలయిక దోహదపడుతుందని అందరూ నమ్ముతున్నారని పురందేశ్వరి స్పష్టం చేశారు. 

ఎక్కడికి వెళ్లినా ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వస్తోందని, విసిగి వేసారిపోయిన వారందరూ కూటమిని ఆశీర్వదించాలని ఉత్సాహంగా ముందుకు వస్తున్న వాతావరణాన్ని మనం రాష్ట్రంలో చూస్తున్నామని అన్నారు. 

సుపరిపాలన కావాలని, అవినీతిరహిత పాలన కావాలని, మన బిడ్డలకు, మహిళలకు, యువతకు, అన్ని వర్గాల వారికి న్యాయం చేసే పరిపాలన మన రాష్ట్రం చూడాలని కోరుకుంటే అందరూ కూటమిని ఆశీర్వదించాలి అని పురందేశ్వరి పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News