బాసికం

పెళ్లంటే నూరేళ్ల పంటని పెద్దలు అంటుంటారు. ప్రతి వ్యక్తి జీవితంలోను పెళ్లి అనేది ప్రధాన పాత్రను పోషిస్తుంది. అటు అమ్మాయికి ... ఇటు అబ్బాయికి సరికొత్త జీవితం ప్రారంభమవుతుంది కాబట్టి, పెళ్లి అనేది ఒక కీలకమైన ఘట్టంగా మారిపోయింది. పెళ్లనేది ఆయా కుటుంబాల ఆచారవ్యవహారాలను ... సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ వుంటుంది.

పెళ్లిలో ప్రతి అంశానికి ... ప్రతి ఘట్టానికి ఎంతో ప్రత్యేకత ... మరెంతో ప్రాధాన్యత వుంటాయి. అలాంటి వాటిలో వధూవరులు నుదుటన ధరించే 'బాసికం' ఒకటి. సాధారణంగా చూస్తే 'బాసికం' ఓ అందమైన అలంకారంగా కనిపిస్తుంది. కానీ శాస్త్ర పరంగా చూస్తే 'బాసికం' వెనుక గల బలమైన అర్ధం బోధపడుతుంది.

వివాహ ఘట్టంలో అత్యంత ముఖ్యమైన సమయం 'సుముహూర్తం'. ఈ సుముహూర్త సమయంలో వధువు రెండు కనుబొమల మధ్య స్థానాన్ని అంటే బొట్టు పెట్టుకునే స్థానాన్ని వరుడు చూడాలి. అలాగే వధువు కూడా వరుడి రెండు కనుబొమల మధ్య ప్రదేశాన్ని చూడాలని అంటారు. అయితే సుముహూర్త సమయంలో ఇరువురు కూడా ఈ విషయాన్ని మరిచిపోకుండా వుండటం కోసం, ఇద్దరి దృష్టి కూడా వెంటనే ఆ స్థానం పై పడటం కోసం నుదుటన 'బాసికాలు' కడుతుంటారు. ఈ విధంగా చేయడం వల్ల ఒకరి పై ఒకరికి ఆకర్షణ పెరుగుతుందని ... తాము ఒకటేననే భావన కలుగుతుందని శాస్త్రం చెబుతోంది.


More Bhakti News