AB Venkateswara Rao: ఏబీ వెంకటేశ్వరరావుకు ఊరట... సస్పెన్షన్ ను కొట్టివేసిన క్యాట్

  • ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ ఏపీ ప్రభుత్వానికి క్యాట్ ఆదేశాలు
  • వెంటనే విధుల్లోకి తీసుకోవాలని స్పష్టీకరణ
  • సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా ఎలా సస్పెండ్ చేశారని క్యాట్ ఆగ్రహం
CAT dismissed suspension orders on AB Venkateswararao

ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్ (కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్) ఊరట కలిగించింది. ఆయనను ఏపీ ప్రభుత్వం రెండోసారి సస్పెండ్ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను క్యాట్ కొట్టివేసింది. 

ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆయనను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, సర్వీస్ పరంగా ఆయనకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని క్యాట్ స్పష్టం చేసింది. ఈ సస్పెన్షన్ చట్ట విరుద్ధమని, ఈ విషయంలో  సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా మరోసారి సస్పెండ్ చేయడం ఒక ఉద్యోగిని వేధించడం కిందికే వస్తుందని క్యాట్ అభిప్రాయపడింది. 

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిఘా విభాగం అధిపతిగా పనిచేసిన కాలంలో ఏబీ వెంకటేశ్వరరావు అవినీతికి పాల్పడ్డారని వైసీపీ సర్కారు ఆరోపించి సస్పెండ్ చేసింది. ఇజ్రాయెల్ నుంచి నిఘా పరికరాల కొనుగోలులో అవినీతికి పాల్పడ్డారన్నది ఆయనపై ఆరోపణ. 

అయితే ఆయన సుప్రీంకోర్టు వరకు వెళ్లి న్యాయ పోరాటం చేసి గెలిచారు. దాంతో ప్రభుత్వం ఆయనను ప్రింటింగ్, స్టేషనరీ, స్టోర్స్ విభాగం కమిషనర్ గా నియమించింది. ఈ నియామకం 2022లో జరగ్గా... కేవలం రెండు వారాల వ్యవధిలోనే ప్రభుత్వం ఆయనను మళ్లీ సస్పెండ్ చేసింది. 

తనను రెండోసారి సస్పెండ్ చేసిన నేపథ్యంలో, ఏబీ వెంకటేశ్వరరావు మరోసారి న్యాయ పోరాటం ప్రారంభించారు. క్యాట్ ను ఆశ్రయించడంతో, ఇటీవల వాదనలు ముగియగా, తీర్పును క్యాట్ రిజర్వ్ లో ఉంచింది. నేడు ఏబీ వెంకటేశ్వరరావుకు అనుకూలంగా తీర్పు వెలువరించింది.

  • Loading...

More Telugu News