విశేష ఫలితాలనిచ్చే దానం ఏది ?

విద్యాదానం ... వస్త్రదానం ... అన్నదానం ... గోదానం ... భూదానం ... ఇలా ఏ దానం చేసిన అనంతమైన పుణ్య ఫలాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఏ దానం చేయడం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుని కొందరు దానం చేస్తుంటారు. మరికొందరు ఎదుటివారి అవసరాన్ని గుర్తించి వాటిని దానం చేస్తుంటారు.

సాధారణంగా ఆడపిల్ల పెళ్లి అనేది తల్లిదండ్రుల ఆర్ధిక పరిస్థితిని పరీక్షిస్తూ వుంటుంది. అలాంటి పరిస్థితుల్లో కొందరు ఇతరులను ఆర్ధిక సాయం కోరతారు. ఆడపిల్ల జీవితానికి పెళ్లి అనేది ఒక రక్షణను ఇస్తుంది. అందువలన చాలామంది కూడా ఎలాంటి ఆలోచన చేయకుండా ఆడపిల్ల పెళ్లికి సాయం చేస్తుంటారు. వారి దానానికి తగినట్టుగానే భగవంతుడు వాళ్లను అనుగ్రహించడం జరుగుతుంది.

ఇక మగపిల్లవాడి విషయానికి వచ్చే సరికి ఉపనయనం కూడా అతని జీవితానికి అంతే అవసరం. ఆర్ధిక పరమైన శక్తి లేనివాళ్లు తమ స్థాయికి తగిన విధంగానే ఉపనయన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఆ స్థితి కూడా లేనివాళ్లు ఇతరుల సాయాన్ని కోరతారు. పూర్వం .. ఉపనయనానికి సాయం చేసే అవకాశం రావడమే అదృష్టంగా భావించే వాళ్లు.

ఉపనయన కార్యక్రమం కోసం దానం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అందువలన ఉపనయనం నిమిత్తం ఎవరైనా సాయం కోరి వస్తే, ఎలాంటి పరిస్థితుల్లోను వాళ్లని ఉత్తచేతులతో తిప్పి పంపించేవారు కాదు. అందువల్లనే పురందరదాసును పరీక్షించడం కోసం ఆయన దగ్గరికి వేంకటేశ్వరస్వామి ఓ బ్రాహ్మణుడి వేషంలో వస్తాడు. తన కొడుకు ఉపనయనానికి ఆర్ధిక సాయం చేయవలసిందిగా కోరతాడు.

అయినా పురందరదాసు దానం చేయడానికి నిరాకరిస్తాడు. పురందరదాసు ధోరణి మనసుకి కష్టం కలిగించడంతో, ఆయన భార్య తన ముక్కుపుల్లను దానంగా ఇస్తుంది. ఆ సంఘటన పురందరదాసును ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తుంది ... ఆ పాండురంగడి సాన్నిధ్యాన్ని ప్రసాదిస్తుంది. అందువలన పేద పిల్లల ఉపనయనానికి అవసరమైన ఆర్ధిక సాయాన్ని అందించాలి. అలాంటి కార్యక్రమం సామూహికంగా జరుగుతున్నప్పుడు తమవంతు సాయం చేయాలి. ఈ విధమైన దానం చేయడం వలన, విశేష పుణ్యఫలాలు లభిస్తాయి ... ఉత్తమగతులు ప్రాప్తిస్తాయని చెప్పబడుతోంది.


More Bhakti News