రావణుడి ఖడ్గం ఎందుకు శక్తిని కోల్పోయింది ?

లోకంలో వున్నవి రెండే రెండు .. అవే మంచి - చెడు. మంచి అంటే సాధుస్వభావమనీ, చెడు అంటే అసుర స్వభావమని చెప్పబడుతోంది. సాధుస్వభావం గలవారు నిర్మలమైన మనసుతో భగవంతుడిని ధ్యానిస్తూ వరాలు పొందగా, అసుర స్వభావం గల వారు అందుకు పూర్తి భిన్నంగా ప్రవర్తిస్తూ శాపాలపాలై చివరికి అధోగతి పాలైనారు. అలాంటి అసురుల జాబితాలో రావణుడు ముందువరుసలో కనిపిస్తాడు.

రావణుడు మహా శివ భక్తుడు ... మహా పరాక్రమశాలి. ఆ గర్వం కారణంగా ఆయన అనేకమంది తాపసుల మనసుకి కష్టం కలిగించే విధంగా వ్యవహరించి శాపాల పాలైనాడు. ఈ శాపాల కారణంగానే రాముడితో జరిగిన యుద్ధంలో రావణుడు ఒక్కడిగా ... ఒంటరిగా నిలిచిపోవలసి వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. రావణుడి పరాక్రమంపై ప్రభావం చూపిన శాపాలలో మహర్షి మౌద్గల్యుడి శాపం ఒకటిగా చెప్పుకోవచ్చు.

ప్రశాంతమైన ఆశ్రమవాతావరణంలో మహర్షి మౌద్గల్యుడు తపస్సు చేసుకుంటూ వుంటాడు. అదే సమయంలో రావణుడు అటుగావస్తాడు. యోగదండం ఆసరాతో కూర్చుని తపస్సు చేసుకుంటోన్న మౌద్గల్యుడిని చూస్తాడు. తన ఖడ్గంతో యోగదండాన్ని కొడితే మహర్షి పడిపోవడం ఖాయమని అనుకుంటాడు. ఆ దృశ్యం చూడాలనే కుతూహలంతో ఖడ్గంతో యోగదండాన్ని కొడతాడు. యోగదండం విరిగిపోవడంతో, ఆసరా కోల్పోయిన మహర్షి ఒక్కసారిగా ముందుకు పడిపోతాడు.

ఆ దృశ్యం చూసిన రావణుడు విరగబడి నవ్వుతాడు. ఆగ్రహావేశాలకు లోనైన మహర్షి, ఏ చంద్రహాస ఖడ్గాన్ని వుపయోగించి తనకి అవమానం కలిగించాడో .. ఆ ఖడ్గం చేపట్టినప్పుడు ఆయన శక్తి హీనుడవుతాడని శపిస్తాడు. కాలాంతరంలో ఈ విషయాన్ని మరిచిపోయిన రావణుడు, రాముడితో యుద్ధానికి దిగిన సమయంలో చద్రహాస ఖడ్గాన్ని ధరిస్తాడు. అన్ని అస్త్రాలను ఉపయోగించిన రావణుడు చివరి ప్రయత్నంగా దానిని ఉపయోగించడానికి సిద్ధపడతాడు.

రావణుడి పరాక్రమానికి ప్రతీకగా నిలిచిన మహాశక్తిమంతమైన ఆ ఖడ్గం, మౌద్గల్య మహర్షి శాపం కారణంగా ఆ సమయంలో నిర్వీర్యమైపోతుంది. ఫలితంగా అచేతనంగా రాముడి ముందు రావణుడు నుంచుండిపోతాడు. ఆ సమయంలోనే ఆయనకి మౌద్గల్య మహర్షి శాపం గుర్తుకు వస్తుంది. సాధు సత్పురుషుల పట్ల అహంభావంతో ప్రవర్తించడమే తన భంగపాటుకి కారణమని ఆయన గ్రహిస్తాడు. దేవతలు ప్రసాదించే నూరువరాల కన్నా, సాధు సత్పురుషుల ఇచ్చే శాపం శక్తిమంతమైనదని అర్థం కావడంతో అక్కడే కుప్పకూలిపోతాడు.


More Bhakti News