విషనాగుల పరీక్షకి నిలిచిన విష్ణు భక్తుడు !

విష్ణుభక్తుడైన కులశేఖర ఆళ్వార్ ... విష్ణువును పూజించడానికీ, ఆయన భక్తులను సేవించడానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉండేవాడు. ఈ నేపథ్యంలో అనునిత్యం విష్ణు భక్తులకు ఆయన ఆతిథ్యం ఇస్తూ ఉండేవాడు. విష్ణు భక్తులను రాజుగారు అంతలా విశ్వసిస్తూ ఆహ్వానిస్తూ ఉండటం, వారిని అత్యంత భక్తి శ్రద్ధలతో సేవిస్తూ ఉండటం అంతఃపుర వ్యవహారాలను చక్కబెట్టే కొంతమందికి నచ్చలేదు.

దాంతో ఆతిథ్యానికి వచ్చే విష్ణుభక్తులను దొంగలుగా చిత్రీకరించడం వలన, వారి పట్ల రాజుగారికి గల అభిమానానికి తెరపడుతుందని భావిస్తారు. కొంతమంది విష్ణు భక్తులు ఆతిథ్యానికి వచ్చినప్పుడు అక్కడ ఉండే అత్యంత విలువైన ఆభరణాన్ని అంతఃపుర పర్యవేక్షకులు తీసి దాస్తారు. ఆ ఆభరణం రాజుగారికి ఎంతో ఇష్టమైనది కావడంతో, అది ఆ స్థానంలో లేకపోవడాన్ని వెంటనే గమనించిన ఆయన అక్కడి పర్యవేక్షకులను దాని గురించి అడుగుతాడు.

ఆతిథ్యానికి వచ్చిన విష్ణు భక్తులే ఆ ఆభరణాన్ని కాజేశారని వాళ్లు అబద్ధం చెబుతారు. దాంతో కులశేఖర ఆళ్వార్ గంగాళం వంటి పెద్ద పాత్రను అక్కడికి తెప్పిస్తాడు. దాంట్లో కొన్ని భయంకరమైన విషనాగులు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. ఆ విషనాగుల మధ్య రాజు తన ఉంగరం వేస్తాడు. విష్ణుభక్తులే ఆభరణాన్ని దొంగిలించారని వాళ్లు చెబుతున్నది నిజమే అయితే, విషనాగుల మధ్యనున్న తన ఉంగరాన్ని తీసి తనకి ఇవ్వమని పర్యవేక్షకులతో అంటాడు.

అలా చేస్తే ప్రాణాలు పోవడం ఖాయమని తెలిసి వాళ్లు భయపడిపోతుంటారు. దాంతో విష్ణుభక్తులపై తనకి పూర్తి విశ్వాసం ఉందనీ, వాళ్లు నిర్దోషులే అయితే ఆ విష నాగులు తనని ఏమీ చేయలేవంటూ గంగాళంలో చేయిపెట్టి తన ఉంగరాన్ని తీసుకుంటాడు. ఈ దృశ్యం చూసిన వాళ్లంతా ఆశ్చర్యపోతారు. ఆభరణాన్ని తీసిన పర్యవేక్షకులు తమ తప్పుని అంగీకరిస్తారు. విష్ణుమూర్తి పట్ల ... ఆయన భక్తుల పట్ల రాజుగారికి గల అభిమానాన్ని అక్కడి వాళ్లంతా ఎంతగానో ప్రశంసిస్తారు.


More Bhakti News