దుఃఖాన్ని తొలగించే దివ్యక్షేత్రం

ఆలయ దర్శనం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది ... ఫలితంగా సరైన ఆలోచనా ధోరణి అలవడుతుంది. సరైన ఆలోచనా విధానం మంచి నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. మంచి నిర్ణయాలు జీవితాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా అభివృద్ధి పథంలో నడిపిస్తాయి. ఈ కారణంగా కొందరు వైష్ణవ ఆలయాలకి .. మరికొందరు శివాలయాలకి .. ఇంకొందరు శక్తి ఆలయాలకి వెళుతూ వుంటారు.

ఇక ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తూ భగవంతుడికి సమీపంగా తీసుకువెళ్ళేది గురువే కనుక, గురుక్షేత్రాలను దర్శించే వారి సంఖ్య కూడా ఎక్కువగానే వుంటుంది. అయితే ఇలా తమ ఇష్ట దేవతలను దర్శించుకోవడం కోసం భక్తులు వివిధ క్షేత్రాలకు తిరగవలసిన పనిలేకుండా ఒక క్షేత్రాన్ని దర్శిస్తే సరిపోతుంది. అదే కృష్ణా జిల్లాలోని 'జనార్ధనపురం'. ఈ క్షేత్రం ఓ ఆలయాల సముదాయంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ అడుగుపెట్టగానే హరిహరులు ... వారి సుతుడుగా చెప్పబడే అయ్యప్పస్వామి ... గణపతి ... హనుమంతుడు కనిపిస్తూ వుంటారు.

అష్టాదశ శక్తి పీఠాల్లోని అమ్మవారి రూపాలను ఈ క్షేత్రంలో ఒకే వేదికపై దర్శించవచ్చు. ఇక ఆది శంకరాచార్యులు .. బ్రహ్మంగారు .. రాఘవేంద్రస్వామి .. రమణ మహర్షి .. శిరిడీ సాయిబాబా విగ్రహాలు ఒకే వరుసలో కొలువై వుంటాయి. అష్టలక్ష్ములు ... నవగ్రహాలు ప్రత్యేక వేదికలపై దర్శనమిస్తూ వుంటారు. ఇంతటి విశిష్టతను సంతరించుకున్న ఈ క్షేత్రం, దర్శన మాత్రం చేతనే దుఃఖాన్ని దూరం చేస్తుందని చెబుతుంటారు.


More Bhakti News