ఆహ్వానాలు అందుకునే అమ్మవారు

ప్రాచీనకాలం నుంచి కూడా గ్రామదేవతలను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ వుండటం జరుగుతోంది. గ్రామదేవత తమ ఊరును కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటుందని గ్రామస్తులు భావిస్తూ వుంటారు. గాలిద్వారా వ్యాపించే వ్యాధులను ... దుష్ట శక్తులను పొలిమేరదాటి రానీయకుండా అమ్మవారు రక్షిస్తూ ఉంటుందని విశ్వసిస్తూ వుంటారు. అలా స్థానికుల ప్రేమానురాగాలను ... నిరంతరం వాళ్లు అందించే సేవలను అందుకుంటోన్న అమ్మవారి క్షేత్రం బెంగుళూర్ లో దర్శనమిస్తుంది.

'అణ్ణమ్మా దేవి' పేరుతో పూజలు అందుకుంటోన్న ఇక్కడి అమ్మవారు స్వయంవ్యక్తమని స్థల పురాణం చెబుతోంది. దైవం తనని అధికంగా ఆరాధించే వారి ద్వారా తన ఆవిర్భవానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటుంది. అలాగే ఓ భక్తుడి కలలో అమ్మవారు కనిపించి తన జాడను తెలియజేసి ఆలయాన్ని నిర్మించవలసిన బాధ్యతను అతనికి అప్పగించింది. ఆ భక్తుడు గ్రామస్తుల సహాయ సహకారాలతో ఆలయాన్ని నిర్మించాడు. అది నేడు అమ్మవారి చల్లని చూపు కారణంగా ఆధ్యాత్మిక చలివేంద్రమై అలరారుతోంది.

సాధారణంగా పిల్లల్లో రెండు రకాల వారు కనిపిస్తూ వుంటారు. అమ్మ పెట్టకుండా తినని వారు కొందరైతే, అమ్మకి పెట్టకుండా తినని వారు కొందరు. ఆ రెండు స్వభావాలు ఇక్కడి గ్రామస్తుల్లో కనిపిస్తాయి. వాళ్లు తమ సంతాన సౌభాగ్యాల పట్ల ... పాడిపంటల పట్ల అమ్మవారి అనుగ్రహం కోరుతూ ప్రత్యేక పూజలు ... ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. సాధారణంగా తమ ఇంట్లో శుభకార్యాలకు ఇష్టదైవాలకు ఆహ్వానం పంపుకోవడం జరుగుతుంది.

కానీ ఇక్కడ ఆహ్వానం చెప్పుకోవడమే కాదు, అమ్మవారి ఉత్సవ మూర్తిని తమతో తీసుకువెళ్లి అక్కడ ఊరేగింపు నిర్వహిస్తారు. ఇందు కోసం ఇక్కడి ఆలయంలో అమ్మవారి ఉత్సవ మూర్తులు ఎక్కువ సంఖ్యలో కనిపిస్తాయి. ఈ విధంగా అమ్మవారిని ఆహ్వానించి ఊరేగింపుతో ఆమెను సంతోష పెట్టి, ఆమె సమక్షంలో వేడుక నిర్వహించడం వలన అంతా మంచే జరుగుతుందని స్థానికులు బలంగా విశ్వసిస్తుంటారు.


More Bhakti News