T20 World Cup 2024: తొలిసారి టీ20 వ‌ర‌ల్డ్‌కప్ ఆడనున్న ఆరుగురు భార‌త‌ ప్లేయ‌ర్లు వీరే

  • మొద‌టిసారి వ‌ర‌ల్డ్‌క‌ప్ ఆడుతున్న జైస్వాల్, శాంసన్, శివం దూబే, కుల్దీప్, చాహల్, మహ్మద్ సిరాజ్
  • ఇప్ప‌టికే టీ20 ప్ర‌పంచ‌క‌ప్ కోసం 15 మంది స‌భ్యుల‌తో కూడిన జ‌ట్టును ప్ర‌క‌టించిన బీసీసీఐ
  • మ‌రో నెల రోజుల్లో ఐసీసీ టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024 ప్రారంభం
Six Players will be Playing T20 World Cup for the First Time for Team India

మ‌రో నెల రోజుల్లో ఐసీసీ టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ప్రారంభం కానుంది. వెస్టిండీస్‌, అమెరికా ఆతిథ్యం ఇస్తున్న ఈ టోర్నీలో మొత్తం 20 దేశాలు పాల్గొంటున్నాయి. ఇప్ప‌టికే ఆయా దేశాలు టోర్నీలో పాల్గొనే 15 మంది స‌భ్యుల‌తో కూడిన‌ త‌మ స్క్వాడ్స్‌ను ప్ర‌క‌టించాయి. ఇందులో భాగంగా భార‌త్ కూడా ఈ పొట్టి ప్రపంచ కప్ కోసం రెండు రోజుల క్రితం జట్టును ప్ర‌క‌టించింది. మొత్తం 19 మంది ఆటగాళ్ల‌ను ఎంపిక చేసింది. వీరిలో 15 మంది సభ్యులు ప్రధాన జట్టులో ఉండగా, మిగిలిన నలుగురు రిజర్వ్ ప్లేయర్‌లుగా ఎంపిక‌య్యారు. 

కాగా, ప్రస్తుతం ప్రకటించిన భారత జట్టులో ఏకంగా ఆరుగురు ప్లేయ‌ర్లు తొలిసారి టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ఆడ‌నున్నారు. ఇలా మొద‌టిసారి వ‌ర‌ల్డ్‌క‌ప్ ఆడుతున్న వారిలో యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, శివం దూబే, కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్, మహ్మద్ సిరాజ్ ఉన్నారు. 

ఇక మ‌న హైద‌రాబాదీ పేస‌ర్‌ మహ్మద్ సిరాజ్‌కి టీ20 ప్ర‌పంచ‌క‌ప్ కోసం ఎంపిక చేసిన భార‌త‌ జ‌ట్టులో చోటు ద‌క్క‌డం చాలా గ్రేట్‌. ఎందుకంటే అత‌నికి టీమిండియా తరపున టీ20 ఫార్మాట్‌లో ఆడిన అనుభవం అంత‌గా లేదు. ఇప్పటివరకు కేవలం 10 మ్యాచ్‌లకు మాత్రమే సిరాజ్ ప్రాతినిధ్యం వ‌హించాడు. అటు యువ ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ కూడా జాక్‌పాట్ కొట్టాడు. 22 ఏళ్ల యశస్వి గతేడాది భార‌త్‌ తరపున ఈ ఫార్మాట్‌లో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 17 టీ20 మ్యాచ్‌లాడిన యంగ్ ప్లేయ‌ర్‌ 161.93 స్ట్రైక్ రేట్‌తో 502 పరుగులు చేయ‌డం విశేషం.

కాగా, ఎంతోకాలంగా జ‌ట్టులో చోటు కోసం నిరీక్షిస్తున్న టాలెంటెడ్ క్రికెట‌ర్ సంజు శాంసన్. ఈ కేర‌ళ ఆట‌గాడికి ఇన్నాళ్లు టీమిండియా త‌ర‌ఫున వ‌ర‌ల్డ్‌క‌ప్ ఆడే అవ‌కాశం వ‌చ్చింది. అతను ఇప్పటివరకు టీమిండియాకు 25 టీ20 మ్యాచ్‌లు ఆడి 133.09 స్ట్రైక్ రేట్‌తో 374 పరుగులు చేయ‌డం జ‌రిగింది. మ‌రో అద్భుత‌మైన ఆల్‌రౌండ‌ర్ శివం దూబే. ఈ ఐపీఎల్ సీజ‌న్‌లో త‌న‌దైన‌ దూకుడుతో కూడిన‌ బ్యాటింగ్ శైలితో సెల‌క్ట‌ర్ల‌ దృష్టిని ఆకర్షించాడు ఈ యువ ప్లేయ‌ర్‌. ఈ పొట్టి ఫార్మాట్‌కు స‌రిగ్గా స‌రిపోతాడ‌నే ఆలోచ‌న‌తో దూబేకు బీసీసీఐ వ‌ర‌ల్డ్‌క‌ప్ జ‌ట్టులో చోటు క‌ల్పించింది. కాగా, శివమ్ భారత్ తరఫున 21 టీ20 మ్యాచ్‌ల‌కు ప్రాతినిధ్యం వ‌హించి, 276 పరుగులు బాదాడు.

ఇక తొలిసారి టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు ఎంపికైన వారిలో ఇద్ద‌రు స్పిన్న‌ర్లు కుల్దీప్ యాద‌వ్‌, య‌జువేంద్ర చాహ‌ల్ ఉండ‌డం గ‌మ‌నార్హం. మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాద‌వ్ ప్ర‌స్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇప్ప‌టివ‌ర‌కు టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ ఆడ‌ని ఈ చైనామెన్ స్పిన్న‌ర్.. ఈ ఫార్మాట్‌లో టీమిండియా త‌ర‌ఫున‌ 35 మ్యాచ్‌లు ఆడాడు. అలాగే  59 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ప్ర‌స్తుతం ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ కు ఆడుతున్నాడు. ఇక టీ20 ఫార్మాట్‌లో భారత్‌కు అత్యంత అనుభవం ఉన్న ఆటగాళ్లలో ఒకడు య‌జువేంద్ర‌ చాహల్. ఇటీవ‌లే ఐపీఎల్‌లో 200 వికెట్లు తీసిన తొలి బౌల‌ర్‌గా కూడా రికార్డుకెక్కాడు. భారత్ తరపున ఇప్పటివరకు 80 మ్యాచ్‌లు ఆడిన చాహల్ 96 వికెట్లు తీశాడు. ఇప్పుడు తొలిసారి టీ20 ప్రపంచకప్‌లో పాల్గొంటున్నాడు.

  • Loading...

More Telugu News