కళ్లు తెరిపించిన బ్రహ్మంగారు

బ్రహ్మంగారు తన శిష్యులతో కలిసి అనేక ప్రాంతాలను దర్శిస్తూ, తన కాలజ్ఞానంతో పాటు వివిధ విషయాలను గురించి ప్రజలకు వివరిస్తూ వాళ్లని చైతన్యవంతులను చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో ఒకసారి ఆయన ఓ గ్రామానికి వెళ్లినప్పుడు, మానవులలో గల మూలాధార చక్రం .. స్వాధిష్టాన చక్రం .. మణిపూరక చక్రం .. అనాహత చక్రం .. విశుద్ధ చక్రం .. ఆజ్ఞా చక్రం .. సహస్రార చక్రం గురించి అక్కడి ప్రజలకు వివరిస్తాడు.

బ్రహ్మంగారి బోధన అయిన తరువాత అంతా తమ తమ ఇళ్లకు వెళ్లిపోతారు. ఓ జంట మధ్య ఈ భోదన గురించిన ప్రస్తావన వస్తుంది. స్వామి చెప్పిన దాంట్లో నిజముందని ఆ భార్య భర్తతో అంటుంది. అంతా ఉత్తదేననీ ... వంట్లో చక్రాలు వుంటే కనిపించేవిగా అంటూ ఆ తాగుబోతు భర్త వాదనకు దిగుతాడు. ఆమె వంట్లోదాగిన చక్రాలను చూస్తానంటూ భార్యను చంపేస్తాడు.

అదే మత్తులో బ్రహ్మంగారి దగ్గరికి వచ్చి తాను చేసిన పని గురించి చెబుతాడు. కడుపు నింపుకోవడం కోసం ఆయన చెప్పిన మాయమాటలే జరిగిన దానికి కారణమంటూ గొడవకి దిగుతాడు. తాను చెప్పిన దాంట్లో నిజం లేకపోతే, భార్యను చంపానంటూ అతను చెబుతోన్న దాంట్లోనూ నిజంలేదని అంటాడు బ్రహ్మంగారు. దాంతో ఆ వ్యక్తి తన భార్య శవాన్ని చూపించడం కోసం బ్రహ్మంగారిని వెంటబెట్టుకుని తన ఇంటికి తీసుకువెళతాడు.

అక్కడ తన భార్య బతికే వుండటం చూసి తన కళ్ళను తానే నమ్మలేకపోతాడు. అంతకుముందు తమ మధ్య ఎలాంటి గొడవ జరగనట్టుగా ఆప్యాయంగా ఆమె దగ్గరికి రావడంతో ఆశ్చర్యపోతాడు. అదంతా బ్రహ్మంగారి మహిమనీ ... ఆయన సామాన్యుడు కాదని గ్రహిస్తాడు. తన అజ్ఞానాన్ని మన్నించమని కోరుతూ ఆయన పాదాలపై పడతాడు.


More Bhakti News