కడుపునింపే కల్పవల్లి క్షేత్రం

సమస్త లోకాలలోని సకల జీవరాశికి శివుడు ఆహారాన్ని అందిస్తూ వుంటాడు. అలాంటి సదాశివుడు అన్నపూర్ణమ్మ తల్లి నుంచి భిక్షను స్వీకరిస్తూ వుంటాడు. తనని ఆదరించిన భక్తులకు ... ఆశ్రయించిన భక్తులకు అమ్మవారు ఆకలిని తీరుస్తూ వుంటుంది. అయితే ఇలా అమ్మవారు ఆహార పాత్రను ధరించి దర్శనమిచ్చే క్షేత్రాలు చాలా తక్కువగా కనిపిస్తూ వుంటాయి. అలాంటి అరుదైన ... విశిష్టమైన క్షేత్రం బెంగళూరులో విరాజిల్లుతోంది.

అమ్మవారి ఆదేశం మేరకు ఈ ప్రాంతానికి చెందిన ఓ భక్తుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్టు స్థలపురాణం చెబుతోంది. విశాలమైన ప్రదేశంలో ... ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆలయం విలసిల్లుతోంది. ఆలయ నిర్మాణం అమ్మవారి వైభవానికి ప్రతీకగా నిలుస్తుంటుంది. గర్భాలయంలోని అమ్మవారు విశాల నేత్రాలను ... చక్కని ముక్కెరను కలిగి, ఓ చేతిలో ఆహార పాత్రతో ... మరో చేతిలో వడ్డించే గరిటతో నయనానందాన్ని కలిగిస్తూ వుంటుంది.

ఇక్కడి అమ్మవారిని భక్తులు 'అంగాళ పరమేశ్వరి'గా ఆరాధిస్తూ వుంటారు. ఇక ఆలయ ప్రాంగణమంతా అమ్మవారి వివిధ రూపాలు కొలువుదీరి కనిపిస్తుంటాయి. వీటిలో కొన్ని భీకరమైనవి కాగా ... మరికొన్ని రూపాలు సాత్వికంగా దర్శనమిస్తూ వుంటాయి. ప్రతి మంగళ .. శుక్ర .. ఆదివారాల్లో అమ్మవారి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ తల్లి అనుగ్రహాన్ని ఆశిస్తూ వుంటారు.

అన్నపూర్ణమ్మ తల్లిని ఆరాధించడం వలన పంటలు బాగా పండుతాయనీ, ఆహార ధాన్యాల కొరత ఉండదని చెబుతుంటారు. అమ్మవారిని కొలిచిన వారికి సౌభాగ్యం స్థిరమవుతుందనీ, సకల శుభాలు కలుగుతాయని అంటారు. మహిమాన్వితమైన ఈ ఆలయ దర్శనం మనసుపై చెరగని ముద్ర వేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.


More Bhakti News