మహిమగల సాయి క్షేత్రం

శ్రీ శిరిడీ సాయిబాబా చెప్పిన 11 వచనాలు ఆయన భక్తులకు బాగా గుర్తుంటాయి. ఆ వచనాల్లో చెప్పినట్టుగానే బాబా తన భక్తులను కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాడు. ఆపదల నుంచి ... అనారోగ్యాల నుంచి తన భక్తులను బయటపడేస్తూ, వారిని అశాంతి నుంచి ప్రశాంతత వైపు నడిపిస్తుంటాడు. ఈ కారణంగానే నేడు అనేక ప్రాంతాలలో బాబా ఆలయాలు ఆవిర్భవిస్తున్నాయి.

అలాంటి బాబా ఆలయాలలో విశిష్టమైనదిగా ... మహిమగలిగినదిగా హైదరాబాద్ - మెహదీపట్నంలోని హుమాయున్ నగర్ ఆలయం చెప్పబడుతోంది. ఈ ప్రాంతానికి చెందిన బాబా భక్తులంతా ఒక బృందంగా ఏర్పడి ఒకప్పుడు చిన్న మందిరంలో ఆయన ప్రతిమను పెట్టుకుని పూజించుకున్నారు. ఆ రోజు నుంచి అనూహ్యమైన విధంగా వాళ్ల జీవితాలు మారిపోయాయి. అప్పటి వరకూ వాళ్లను వెంటాడుతూ వచ్చిన సమస్యలు దూది పింజల్లా ఎగిరిపోయాయి. ఎవరి రంగంలో వాళ్లు ఆశించిన ఫలితాలు పొందుతూ వచ్చారు.

దాంతో తమ జీవితాల్లో వెలుగులు నింపిన బాబాపట్ల కృతజ్ఞతా భావంతో అంతా కలిసి పెద్ద ఆలయాన్ని నిర్మించారు. సువిశాలమైన ప్రదేశంలో తీర్చిదిద్దిన ఈ ఆలయంలో, వేదికపై బాబా చిరునవ్వులు చిందిస్తూ దర్శనమిస్తాడు. ఆయనకి రెండు వైపులా గణపతి - దత్తాత్రేయుడు కొలువుదీరి కనిపిస్తుంటారు. ఆలయ ప్రాంగణంలోనే 'ధుని' ... 'గురుస్థాన్' దర్శనమిస్తాయి.

శిరిడీలో మాదిరిగానే బాబాకి ఇక్కడ అభిషేకాలు ... హారతులు ... ఉత్సవాలు జరుగుతుంటాయి. ఇక్కడే శివయ్య కూడా తన భక్తులచే పూజలు అందుకుంటూ వుంటాడు. ఈ ఆలయానికి ప్రతి గురువారంతో పాటు ప్రతి సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా వుంటుంది. బాబాను విశ్వసించిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుందనేది ఇక్కడి భక్తుల నోట వినిపిస్తూ వుంటుంది.


More Bhakti News