సంతానామిచ్చే అమ్మవారు

కర్ణాటక ప్రాంతం అనేక పుణ్యక్షేత్రాల పుట్టినిల్లుగా కనిపిస్తూ వుంటుంది. ఆహ్లాదకరమైన ఇక్కడి వాతావరణం, అడుగడుగునా ఆధ్యాత్మికతను వికసింపజేస్తూ వుంటుంది. కొండలు ... నదీ తీరాల వెంట ఇక్కడ ఆవిర్భవించిన క్షేత్రాలు అణువణువునా భక్తిభావ పరిమళాలను వెదజల్లుతూ వుంటాయి. ఈ కారణంగా ఈ ప్రాంతం నిత్యం పండుగలు జరుపుకుంటున్నట్టుగా అనిపిస్తూ వుంటుంది.

అలా ఇక్కడ ఆవిర్భవించి స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల భక్తులను కూడా ప్రభావితం చేస్తోన్న క్షేత్రాల్లో 'కటపాడు'లోని 'శ్రీ దుర్గాపరమేశ్వరి' క్షేత్రం ఒకటిగా కనిపిస్తూ వుంటుంది. ఆపదలను తొలగించి ఆకలిని తీర్చే అమ్మవారిని ఇక్కడి వారు ఇలవేల్పుగా భావించి ఆరాధిస్తుంటారు. అమ్మ ఉన్నవాళ్లు అదృష్టవంతులు ... ఐశ్వర్యవంతులు అన్నట్టు, ఇక్కడ అమ్మవారు ఉన్నంతవరకూ తమకి ఎలాంటి లోటూ ఉండదని భక్తులు అనంతమైన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తుంటారు.

అంకిత భావంతో కూడిన వారి ఆరాధనలను అందుకుంటూ, అమ్మవారు దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతుంటుంది. కడిగిన ముత్యంలా కనిపించే ఈ ఆలయం, అంతటా పవిత్రతను ఆవిష్కరిస్తూ వుంటుంది. అమ్మవారితో పాటు ఇక్కడ శివయ్య 'ఓంకారేశ్వరుడు' పేరున పూజలు అందుకుంటూ వుంటాడు. ఇక ఆ పక్కనే వీరభద్రస్వామి కూడా భారీ ఆకారంలో దర్శనమిస్తూ ఉంటాడు.

ఆదిదంపతులు కొలువైన కారణంగా ఇది అత్యంత విశిష్టమైన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక సంతానాన్ని అనుగ్రహించడంలో ఇక్కడి ఆది దంపతులకు మంచి పేరుంది. సంతానం లేనివారు ఈ క్షేత్రాన్ని దర్శించి సంతానం కోరుకుంటే, అనతికాలంలోనే వారి కోరిక నెరవేరుతుందని చెబుతారు. ఇక సంతానాన్ని పొందినవారు అమ్మవారికి 'కొబ్బరిపువ్వు' ను మొక్కుబడిగా చెల్లించడం ఇక్కడి ఆనవాయతీగా వస్తోంది. శివరాత్రి ... విజయదశమి వంటి పర్వదినాల్లోను, కార్తీక మాసంలోను ఇక్కడ ప్రత్యేక పూజలు ... ఉత్సవాలు జరుగుతుంటాయి.


More Bhakti News