హరిహరుల ఆరాధనలో తాడిపత్రి

శివకేశవులు కొలువుదీరిన మనోహరమైన పుణ్య క్షేత్రం 'తాడిపత్రి'. ఇది అనంతపూర్ సమీపంలో అశేష భక్తజన కోటికి ఆహ్వానం పలుకుతోంది. ఈ క్షేత్రంలోని 'చింతల వేంకటరమణ స్వామి'వారి ఆలయం ... 'బుగ్గరామలింగేశ్వర స్వామి'వారి ఆలయం ప్రాచీన వైభవాన్ని సంతరించుకుని కనిపిస్తాయి. వేంకటరమణస్వామి వారి ఆలయం బుక్కరాయల కాలంలోనూ ... రామలింగేశ్వరస్వామి వారి ఆలయం ప్రౌఢ దేవరాయల వారి కాలంలోనూ నిర్మించబడినట్టు శాసన ఆధారాలు కనిపిస్తున్నాయి.

భూమిని చీల్చుకు వచ్చినట్టుగా కనిపించే రామలింగేశ్వరుడితో పాటు, పార్వతీ దేవి అమ్మవారు ఇక్కడ పూజలు అందుకుంటూ వుంటుంది. స్వామివారి వైపే చూస్తూ నందీశ్వరుడు దర్శనమిస్తాడు. ఇక కోదండ రామస్వామి కూడా ఇక్కడికి వచ్చిన భక్తులకు అభయమిస్తూ కనిపిస్తాడు. విశాలమైన ఆలయ ప్రాంగణం ... పొడవైన ప్రాకారాలు ... ఎత్తైన గోపురాలు ఆనాటి నిర్మాణ నైపుణ్యానికి అద్దం పడుతుంటాయి.

ఇక ఇక్కడి శిల్ప సంపదను ప్రత్యక్షంగా చూడవలసినదే కాని మాటల్లో ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కొన్ని నిర్మాణాలు శిధిలావస్థకు చేరుకున్నప్పటికీ ... వాటిలోని జీవకళ ఆనాటి శిల్పకళా చాతుర్యాన్ని సజీవంగానే కళ్ల ముందుంచుతోంది. పినాకినీ నదీ తీరంలో వెలసిన ఈ క్షేత్రం, ఇటు ఆధ్యాత్మిక పరమైన అనుభూతిని ... అటు చారిత్రక పరమైన వైభవాన్ని ప్రకృతి సౌందర్యమనే వేదికపై ఆవిష్కరిస్తుందనడంలో ఎలాంటి సందేహంలేదు.


More Bhakti News