రూ.50 లక్షలతో పెళ్లి కోసం, రూ.45 లక్షల లోన్ తీసుకోమంటున్నారు..!: నెట్టింట యువకుడి పోస్ట్ వైరల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రూ.50 లక్షలతో పెళ్లి కోసం, రూ.45 లక్షల లోన్ తీసుకోమంటున్నారు..!: నెట్టింట యువకుడి పోస్ట్ వైరల్

Parents demand son To Take Rs 45 Lakh Loan
  • కుమారుడి పెళ్లికి రూ. 50 లక్షలు ఖర్చు చేయాలన్న తల్లిదండ్రులు
  • అందుకోసం రూ. 45 లక్షలు లోన్ తీసుకోమని ఒత్తిడి
  • రూ. 15 లక్షలతో నిరాడంబరంగా పెళ్లికి అమ్మాయి కుటుంబం సిద్ధం
  • అప్పు చేసి ఆడంబరాలకు పోవద్దంటూ నెటిజన్ల ఏకగ్రీవ సూచన
ఓ యువకుడు తన వివాహ వేడుక విషయంలో తీవ్ర సందిగ్ధంలో పడ్డాడు. సుమారు రూ. 50 లక్షల వ్యయంతో అత్యంత వైభవంగా వివాహం జరిపించాలనుకుంటున్నామని, అందుకోసం దాదాపు రూ. 45 లక్షల మేర అప్పు చేయాలని తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తుండటంతో, దిక్కుతోచని స్థితిలో తన సమస్యను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

27 ఏళ్ల ఓ యువకుడు చాలాకాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఇరు వర్గాల పెద్దలను ఒప్పించి కులాంతర వివాహానికి సిద్ధమయ్యాడు. అయితే, అతని తల్లిదండ్రులు సుమారు 1,500 మంది అతిథుల సమక్షంలో రూ. 50 లక్షల భారీ బడ్జెట్‌తో పెళ్లి చేయాలని పట్టుబడుతున్నారు. ఇందులో భాగంగానే రూ. 10 లక్షల విలువైన కారు కొనుగోలును కూడా తప్పనిసరి చేశారు. కాగా, అమ్మాయి తరఫు వారు మాత్రం రూ. 15 లక్షల పరిమితిలో నిరాడంబరంగా పెళ్లి నిర్వహించేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు.

పెళ్లి ఖర్చుల నిమిత్తం తమకున్న భూమి అమ్మకం కాకపోతే, కుమారుడినే రూ. 45 లక్షలు వరకు వ్యక్తిగత రుణం తీసుకోవాలని తల్లిదండ్రులు సూచించడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పటికే తమ కుటుంబ ఆస్తులు బ్యాంకులో తాకట్టులో ఉన్నాయని, తన తండ్రి పేరిట రూ. 50 లక్షల మేర అప్పులు కూడా ఉన్నాయని ఆ యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. కుటుంబంలో గతంలో ఎవరికీ ఇంత ఘనంగా పెళ్లి జరగలేదని, ఇది కులాంతర వివాహం కావడంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని తల్లిదండ్రులు వాదిస్తున్నారు. ఒకవేళ అంత ఖర్చు పెట్టలేని పక్షంలో వివాహాన్ని మరో రెండేళ్ల పాటు వాయిదా వేసుకోవాలని వారు షరతు విధిస్తున్నారు.

ఈ క్రమంలో తన ఆవేదనను సదరు యువకుడు 'రెడ్డిట్' వేదికగా పంచుకోగా, నెటిజన్లు అతనికి మద్దతుగా నిలిచారు. "ఒక్కరోజు ఆడంబరం కోసం జీవితకాలం అప్పుల భారం మోయవద్దు", "ఆడంబరాల కోసం అప్పులు చేయడం ఆర్థికంగా పతనం కావడమే" అంటూ పలువురు అభిప్రాయపడ్డారు. తల్లిదండ్రుల ఒత్తిడికి లొంగకుండా, ఆర్థిక వివేకంతో సరైన నిర్ణయం తీసుకోవాలని నెటిజన్లు అతనికి సూచించారు.
Advertisement
Loan for Marriage
Wedding Loan

More Telugu News