చైనాలో వింత దృశ్యం.. పవర్ చార్జింగ్ కోసం మోకాళ్లపై కూర్చుని రోబో భిక్షాటన!
- సిచువాన్ ప్రావిన్స్ వీధుల్లో హ్యూమనాయిడ్ రోబో భిక్షాటన
- డొనేషన్ ప్లేట్, క్యూఆర్ కోడ్‌తో వినూత్నంగా అభ్యర్థన
- ఇది మార్కెటింగ్ స్టంటా అని సోషల్ మీడియాలో జోరుగా చర్చ
చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో తొలుత వెలుగుచూసిన ఈ దృశ్యంలో 'యూనిట్రీ' అనే రోబోటిక్స్ సంస్థ రూపొందించిన 'జీ1' మోడల్ రోబో కనిపిస్తుంది. ఇది తన రెండు చేతులూ జోడించి అత్యంత దీనంగా మోకాళ్లపై కూర్చుని ఉండటం గమనార్హం. దాని ముందు ఒక డొనేషన్ ప్లేట్, డిజిటల్ చెల్లింపుల కోసం ఒక క్యూఆర్ కోడ్‌ను సైతం ఏర్పాటు చేశారు. "రీఛార్జ్ చేసుకోవడానికి డబ్బులు లేవు", "దయచేసి పవర్ రీఛార్జ్ బిల్లుల కోసం సహాయం చేయండి" అనే సందేశాలు అందులోని లౌడ్ స్పీకర్ ద్వారా నిరంతరం వినిపిస్తున్నాయి. అటుగా వెళుతున్న కొందరు బాటసారులు నాణేలు వేయడం, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డబ్బులు పంపించడం వంటి దృశ్యాలు ఆ వీడియోలో రికార్డయ్యాయి.
కేవలం సిచువాన్లోనే కాకుండా చెంగ్డూ, బీజింగ్, గ్వాంగ్జౌ వంటి ప్రధాన నగరాల్లోనూ ఇలాంటి వింత ఘటనలు వెలుగుచూశాయి. సుమారు 16,000 డాలర్ల (దాదాపు రూ. 13 లక్షలు) విలువ చేసే ఈ అత్యాధునిక రోబోలు ఇలా రోడ్డు పక్కన భిక్షాటన చేయడం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి అత్యంత క్లిష్టమైన పనులను సైతం అలవోకగా చేయగలిగే సామర్థ్యం ఈ రోబోలకు ఉంది. కొద్ది నెలల క్రితమే ఈ మోడల్‌కు చెందిన ఒక రోబో ఈక్వెడార్‌లోని ఒక అగ్నిపర్వతాన్ని కూడా అధిరోహించింది.
ఈ వీడియోలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. 'ఇక బిచ్చగాళ్ల స్థానాన్ని కూడా రోబోలే భర్తీ చేస్తాయా?' అంటూ కొందరు వ్యంగ్యంగా కామెంట్ చేస్తున్నారు. ఇది కేవలం ఒక మార్కెటింగ్ గిమ్మిక్కా లేక సరికొత్త కళాత్మక ప్రదర్శనా, లేదంటే డబ్బు సంపాదించడానికి ఎంచుకున్న వినూత్న మార్గమా? అని పలువురు అభిప్రాయపడుతున్నారు.