‘హర్మూజ్’ను దాటి భారత్‌కు.. భారీ లోడుతో ఇండియాకు వస్తున్న ఎరువుల నౌకలు
- 1.8 లక్షల టన్నుల యూరియా, డీఏపీ, సల్ఫర్ దిగుమతి
- కృష్ణపట్నం, కాకినాడతో పాటు ఒడిశా, గుజరాత్ పోర్టులకు చేరుకోనున్న నౌకలు
- జూన్ 22 నాటికి దేశంలో 196.08 లక్షల టన్నుల ఎరువుల నిల్వలు
- ఖరీఫ్ సీజన్ సాగుకు ఎరువుల కొరత లేకుండా కేంద్రం పటిష్ట చర్యలు
హర్మూజ్ జలసంధి వద్ద నౌకల రాకపోకలపై ఉన్న ఆంక్షల వల్ల ఎరువుల సరఫరా నిలిచిపోతుందేమోనన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే, ఈ నాలుగు నౌకలు సురక్షితంగా దాటడంతో ఖరీఫ్ పంటల సాగుకు ఎరువుల లభ్యతపై ఉన్న ఒత్తిడి పూర్తిగా తొలగిపోయింది. జూన్ 22 నాటికి దేశంలో మొత్తం 196.08 లక్షల టన్నుల ఎరువుల నిల్వలు ఉన్నాయి. గతేడాది ఇదే సమయానికి ఉన్న 168.67 లక్షల టన్నులతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. ఇందులో ప్రస్తుతం 81.44 లక్షల టన్నుల యూరియా, 20.92 లక్షల టన్నుల డీఏపీ నిల్వలు సిద్ధంగా ఉన్నాయి. మార్చి 1 నుంచి జూన్ 21 వరకు ఎరువుల అమ్మకాలు కూడా గత ఏడాదితో పోలిస్తే 13.2 లక్షల టన్నులు పెరిగి, మొత్తం 153.4 లక్షల టన్నులకు చేరడం దేశీయంగా ఉన్న భారీ డిమాండ్‌ను సూచిస్తోంది.
మరోవైపు దేశీయంగా కూడా ఎరువుల ఉత్పత్తి రికార్డు స్థాయిలో 133.12 లక్షల టన్నులకు చేరింది. ఖతార్, ఒమన్, రష్యా, ఈజిప్ట్ వంటి వివిధ దేశాల నుంచి విభిన్న మార్గాల ద్వారా దిగుమతులను క్రమబద్ధీకరించడం వల్ల ఈ బ్యాలెన్స్డ్ సప్లై చైన్ సాధ్యమైందని అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాలపై ఆధారపడి సాగయ్యే ఖరీఫ్ పంటలు దేశ ఆహార భద్రతకు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు జీవనాడి లాంటివి. ఈ తరుణంలో సకాలంలో, అందుబాటు ధరల్లో ఎరువులు లభించడం కోట్లాది రైతు కుటుంబాల ఆదాయానికి, పంటల దిగుబడికి ఎంతగానో దోహదపడుతుందని వ్యవసాయ నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.