లక్నోలో ఘోర అగ్నిప్రమాదం.. భవనంపై నుంచి దూకిన విద్యార్థులు
- లక్నో కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం
- ప్రమాదంలో నలుగురు మృతి చెందినట్లు అనుమానం
- కొనసాగుతున్న సహాయక చర్యలు, పలువురికి గాయాలు
- ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి
విద్యాబోధనతో పాటు గేమింగ్ జోన్ కూడా నిర్వహిస్తున్న ఈ భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి వేగంగా విస్తరించాయి. దట్టమైన పొగ, అగ్నికీలలు భవనాన్ని చుట్టుముట్టడంతో లోపల ఉన్నవారు చిక్కుకుపోయారు. ప్రాణాలు కాపాడుకునే క్రమంలో కొందరు విద్యార్థులు భవనం మొదటి అంతస్తు నుంచి కిందకు దూకేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళం, పోలీసు యంత్రాంగం వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాయి.
ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం సేవలు అందించాలని, బాధితులకు అవసరమైన అన్ని విధాలా అండగా నిలవాలని ఆయన సూచించారు.
ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది కూలింగ్ ఆపరేషన్స్‌తో పాటు, భవనంలో ఇంకా ఎవరైనా చిక్కుకున్నారా అనే అంశంపై గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ దుర్ఘటనపై సమగ్ర దర్యాప్తునకు అధికారులు ఆదేశించారు. భద్రతా నిబంధనల ఉల్లంఘన ఏమైనా జరిగిందా అనే కోణంలోనూ విచారణ చేపట్టనున్నారు.