పాస్‌పోర్ట్ కూడా లేని స్టూడెంట్‌కు అబుదాబీ సెంటర్.. నీట్ ప్రహసనంపై రాహుల్ నిప్పులు!

Rahul Gandhi slams NEET farce after student gets Abu Dhabi center
  • ఈ నెల 21న నీట్ రీ-ఎగ్జామ్
  • నాగపూర్‌కు చెందిన విద్యార్థికి అబుదాబి సెంటర్ కేటాయించిన ఎన్‌టీఏ 
  • పిల్లలు, తల్లిదండ్రుల ఓపికను ఎన్‌టీఏ పరీక్షిస్తోందన్న రాహుల్

దేశవ్యాప్తంగా ఇప్పటికే తీవ్ర దుమారం రేపుతున్న ‘నీట్’ ఎగ్జామ్స్ వ్యవహారంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) మరోసారి తీవ్ర విమర్శలపాలైంది. రీ-ఎగ్జామ్ నిర్వహణలో ఎన్‌టీఏ చేసిన ఒక వింతైన ఘోర తప్పిదం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. మహారాష్ట్రకు చెందిన ఒక పేద విద్యార్థిని ఏకంగా దేశం దాటించే ప్రయత్నం చేసింది ఎన్‌టీఏ.


నాగపూర్‌కు చెందిన అబ్దుల్లా మహమ్మద్ తాలిబ్ అనే నీట్ అభ్యర్థి జూన్ 21న జరగబోయే రీ-టెస్ట్‌కు అప్లై చేసుకున్నాడు. అయితే ఎన్‌టీఏ సిస్టమ్ లోపమో లేక అధికారుల నిర్లక్ష్యమో తెలీదు కానీ.. అతనికి నాగపూర్‌లో కాకుండా ఏకంగా యూఏఈ లోని అబుదాబిలో ఎగ్జామ్ సెంటర్ కేటాయించారు. పాస్‌పోర్ట్ కూడా లేని ఆ కుర్రాడు హాల్ టికెట్ చూసి షాకయ్యాడు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయి, ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవడంతో.. ఎన్‌టీఏ నాలుక్కరుచుకుంది. ఆ సెంటర్‌ను మళ్లీ నాగపూర్‌కు మారుస్తూ అర్ధరాత్రి నిర్ణయం తీసుకుంది.


ఎన్‌టీఏ చేసిన ఈ పనిపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. "ఆ విద్యార్థి టెన్షన్‌తో రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాడు. అసలు పరీక్ష రాయాలా వద్దా అనే భయంతో వణికిపోతున్నాడు. అసలు స్టూడెంట్స్ పడే ఈ మానసిక వేదనను మీరు ఊహించగలరా? దేశంలోని పిల్లలు, తల్లిదండ్రుల ఓపికను ఎన్‌టీఏ పరీక్షిస్తోంది" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఎగ్జామ్స్ నిర్వహణలో నిరంతరం జరుగుతున్న తప్పులను ప్రస్తావిస్తూ.. "ఇది కేవలం పరీక్ష కాదు.. ఒక తరం మొత్తానికి చెందిన డబ్బు, సమయం, మానసిక ప్రశాంతతను దోచుకోవడమే. మన పిల్లల భవిష్యత్తుతో జూదం ఆడటం ఆపండి. దేశ యువతకు బాధ్యతాయుతమైన, పారదర్శకమైన విద్యా వ్యవస్థ అవసరం" అని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.

Go Back to Shorts
NEET
Rahul Gandhi
NTA
Abu Dhabi exam center
Nagpur student
NEET re-exam 2024

More Telugu News