ఎబోలాపై తెలంగాణ ప్రభుత్వం పూర్తి అప్రమత్తం: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో నిఘా కట్టుదిట్టం!

Telangana Government fully alert on Ebola Strict surveillance at Shamshabad Airport
  • ఎబోలాపై దామోదర్ రాజనర్సింహ సమీక్ష
  • విమానాశ్రయంలో స్క్రీనింగ్, సర్విలెన్స్‌ను కట్టుదిట్టం చేసినట్టు వెల్లడి
  • ఇద్దరు ప్రయాణికులకు ఎబోలా నెగెటివ్ వచ్చిందన్న మంత్రి

ప్రపంచాన్ని టెన్షన్ పెడుతున్న ఎబోలా వైరస్ నియంత్రణపై తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. రాష్ట్ర సచివాలయంలో వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో స్క్రీనింగ్, సర్విలెన్స్‌ను మరింత కట్టుదిట్టం చేసినట్లు ఆయన వెల్లడించారు. ఎబోలా ప్రభావిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై విమానాశ్రయం నుంచే 21 రోజుల పాటు కఠిన పర్యవేక్షణ ఉంటుందని స్పష్టం చేశారు.


విదేశీ ప్రయాణికులతో కమ్యూనికేషన్ సులువుగా ఉండేందుకు ఎయిర్‌పోర్ట్‌లో ఫ్రెంచ్, అరబిక్, స్వాహిలి భాషలు తెలిసిన సిబ్బందిని నియమించాలని మంత్రి సూచించారు. కాంటాక్ట్ ట్రేసింగ్ కోసం హెల్త్, పోలీస్, ఎయిర్‌పోర్ట్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. తప్పుడు సమాచారం లేదా తప్పుడు అడ్రస్‌లు ఇచ్చే ప్రయాణికులపై ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.


రాష్ట్రంలో నమోదైన ఇద్దరు అనుమానితులకు ఎబోలా నెగెటివ్ వచ్చిందని, అయితే నిర్ధారణ కోసం మరోసారి నమూనాలను పరీక్షకు పంపామని మంత్రి తెలిపారు. అత్యవసర పరిస్థితుల కోసం గాంధీ ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డులను సిద్ధం చేశామన్నారు. సీసీఎంబీకి టెస్టింగ్ కిట్లు అందాయని, పరీక్షలు కూడా ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. కేంద్ర ఆరోగ్యశాఖ, ఐసీఎంఆర్ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందని... కాబట్టి ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.

Go Back to Shorts
Ebola Virus
Telangana Government
Damodar Rajanarsimha
Shamshabad Airport
Hyderabad Health Department
Gandhi Hospital Isolation

More Telugu News