రాజౌరీ ఎన్‌కౌంటర్ ఆపరేషన్‌లో విషాదం.. లోయలో పడి ఆర్మీ లెఫ్టినెంట్ కన్నుమూత
- జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో శనివారం సాయంత్రం ఘటన
- ఉగ్రవాదుల ఏరివేత కోసం 'ఆపరేషన్ షేరువాలి'
- దొరిమాల్ అటవీ ప్రాంతంలో గాలింపు
- ప్రమాదవశాత్తు కాలు జారి లోయలో పడిపోయిన వైనం
- ఆయనను రక్షించి ఆసుపత్రికి తరలించినా దక్కని ప్రాణం
రాజౌరీ పరిధిలోని పిర్ పంజాల్ పర్వత శ్రేణుల్లో 15 రోజులుగా 'ఆపరేషన్ షేరువాలి' (Operation Sheruwali) పేరుతో భారీ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. దొరిమాల్, గంభీర్ ముగలన్ అడవుల్లో ఇద్దరు లేదా ముగ్గురు పాకిస్థానీ ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న నిఘా వర్గాల పక్కా సమాచారంతో మే 22న ఆర్మీ, జమ్మూకశ్మీర్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ (CRPF) బలగాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ను ప్రారంభించాయి. శనివారం సాయంత్రం దొరిమాల్ ప్రాంతంలోని అత్యంత దుర్ఘటమైన కొండ మార్గాల్లో తనిఖీలు నిర్వహిస్తుండగా.. సదరు లెఫ్టినెంట్ అదుపు తప్పి సుమారు 30 మీటర్ల (దాదాపు 100 అడుగులు) లోతైన కనుమలోకి పడిపోయారు.
అడుగడుగునా పొంచి ఉన్న ప్రమాదాలు
ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన తోటి సైనికులు భారీ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి ఆయనను పైకి తీసుకువచ్చారు. చికిత్స నిమిత్తం అత్యవసరంగా ఆసుపత్రికి తరలించినప్పటికీ.. తీవ్రమైన అంతర్గత గాయాల కారణంగా ఆయన అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాగా, ఆపరేషన్ ప్రారంభంలో ఒకసారి భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరగ్గా.. ఆ తర్వాత ముష్కరులు సైన్యం ఒత్తిడి తట్టుకోలేక అడవుల్లో లోపలి ప్రాంతాలకు పారిపోయినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ అటవీ ప్రాంతాన్ని చుట్టుముట్టిన సైన్యం డ్రోన్లు, స్నిఫర్ డాగ్స్ (జాగిలాలు), హెలికాప్టర్ల సాయంతో ఉగ్రవాదుల స్థావరాలను వెతికి పట్టుకునే పనిలో ఉంది. ముష్కరులను తుదముట్టించే వరకు ఈ ఆపరేషన్ ఆగదని సీనియర్ సైనికాధికారి ఒకరు స్పష్టం చేశారు.