Advertisement

అమెరికా దాడిని తట్టుకునేలా.. శాటిలైట్‌ చిత్రాల్లో బయటపడ్డ చైనా రహస్యాలు..!

China Secret Military Construction Spotted in Satellite Images
  • ఎడారిలో చైనా భారీ సైనిక నిర్మాణాలు
  • 80కి పైగా కొత్త లాంచ్ ప్యాడ్‌లు
  • క్షిపణి కేంద్రాల చుట్టూ రక్షణ వలయం
  • అమెరికా దాడిని తట్టుకునేలా వ్యూహాలు
  • వేగంగా పెరుగుతున్న డ్రాగన్ అణు శక్తి
చైనాలోని ఓ మారుమూల ఎడారిలో భారీ సైనిక నిర్మాణాలు వేగంగా సాగుతున్నట్లు సమాచారం. ఒకప్పుడు ఖాళీగా ఉన్న ఈ ప్రాంతంలో ఇప్పుడు లాంచ్ ప్యాడ్‌లు, బంకర్లు, కమ్యూనికేషన్ కేంద్రాలు వెలిసినట్లు శాటిలైట్ చిత్రాల ద్వారా తెలుస్తోంది. నిపుణులు పరిశీలించిన ఈ చిత్రాల ప్రకారం, సుదూర ప్రాంతాలకు అణు క్షిపణులను ప్రయోగించే సైనిక స్థావరాల సమీపంలోనే ఈ కొత్త నెట్‌వర్క్ ఏర్పాటవుతున్నట్లు సమాచారం అందుతోంది.

అమెరికాకు చెక్ పెట్టేందుకేనా?
అమెరికా వంటి శత్రు దేశాలు ముందస్తుగా దాడి చేసినా చైనా తన అణు సామర్థ్యం దెబ్బతినకుండా ఉండేందుకే ఈ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. చైనా క్షిపణులు ఇప్పటికే అమెరికాలోని ఏ నగరానికైనా చేరుకోగలవని, అయితే ఈ కొత్త రక్షణ వ్యవస్థ ద్వారా బీజింగ్ తన తిప్పికొట్టే సామర్థ్యాన్ని మరింత పెంచుకుంటోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తైవాన్ సార్వభౌమాధికారంపై ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఎనిమిది కోణాల వింత ఆకారం
షింజియాంగ్ ఎడారి ప్రాంతంలో ఎనిమిది కోణాల ఆకారంలో నిర్మించిన రెండు ప్రత్యేక సైనిక స్థావరాలను నిపుణులు గుర్తించారు. ఈ అష్టభుజి నిర్మాణాల చుట్టూ సిబ్బంది నివాసాలు, భారీ సైనిక వాహనాలు, అత్యాధునిక బంకర్లు, వైమానిక దళాలు ఉన్నట్లు శాటిలైట్‌ చిత్రాల్లో కనిపిస్తోంది. ప్రత్యేక రోడ్లు, కమ్యూనికేషన్ మార్గాల ద్వారా ఈ వింత ఆకారపు స్థావరాలను ప్రధాన క్షిపణి కేంద్రాలకు అనుసంధానించినట్లు స్పష్టమవుతోంది.

మొబైల్ లాంచర్ల మోహరింపు?
ఈ ఎడారి నెట్‌వర్క్‌లో దాదాపు 80కి పైగా సరికొత్త లాంచ్ ప్యాడ్‌లు ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. వీటి నుంచి మొబైల్ క్షిపణులను సులభంగా ప్రయోగించవచ్చని, అలాగే శత్రువుల వైమానిక దాడులను అడ్డుకునే క్షిపణి రక్షణ వ్యవస్థలు కూడా ఇక్కడ ఉండవచ్చని సమాచారం. ఎలక్ట్రానిక్ యుద్ధ తంత్ర కేంద్రాలతో పాటు ఉపగ్రహ సమాచార మార్పిడి కోసం పెద్ద టవర్లను కూడా ఇక్కడ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.

పెరిగిన అణు ఉద్రిక్తతలు
తైవాన్ వివాదంపై చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఇప్పటికే అమెరికా ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. తాము మొదటగా అణు దాడి చేయబోమనే విధానానికి కట్టుబడి ఉన్నామని చైనా చెబుతున్నా అవసరమైతే అణు బెదిరింపులకు వెనకాడబోదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ అణు విస్తరణపై అటు చైనా రక్షణ శాఖ గానీ, ఇటు అమెరికా పెంటగాన్ గానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
Advertisement
China
China military
military construction
nuclear missiles
Xinjiang desert
US China relations
Taiwan
nuclear expansion
satellite images

More Telugu News