తండ్రిపై కోపం.. 100 కి.మీ. మేర సైకిల్ తొక్కిన బాలుడు.. పోలీసులను పరుగులు పెట్టించిన ఘటన!

Prodduturu Boy Cycles 100km After Fight With Father
  • తండ్రి మందలించడంతో కోపంతో ఇంటి నుంచి వెళ్లిపోయిన బాలుడు
  • ప్రొద్దుటూరు నుంచి నంద్యాలకు 100 కి.మీ. మేర రాత్రంతా సైకిల్ ప్రయాణం
  • నంద్యాలలో సైకిల్ వదిలేసి రైలెక్కి కర్ణాటకలోని రాయచూర్‌కు పయనం
  • సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా బాలుడి ఆచూకీని కనుగొన్న పోలీసులు
  • రాయచూర్‌లో బాలుడిని గుర్తించి సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగింత
కడప జిల్లా ప్రొద్దుటూరులో ఓ బాలుడు తండ్రిపై కోపంతో ఏకంగా 100 కిలోమీటర్లకు పైగా సైకిల్ తొక్కుకుంటూ వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచాడు. చిన్న విషయానికే అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయిన ఆ బాలుడు.. పోలీసులను పరుగులు పెట్టించాడు. చివరకు సీసీటీవీ ఫుటేజీల సహాయంతో పోలీసులు బాలుడి ఆచూకీని కనుగొని, సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు.

వివరాల్లోకి వెళితే... ప్రొద్దుటూరుకు చెందిన దంపతులకు ఇద్దరు కుమారులు. ఇంట్లో అన్నదమ్ములిద్దరూ గొడవపడటంతో తండ్రి జోక్యం చేసుకుని, 9వ తరగతి చదువుతున్న చిన్న కుమారుడిని మందలించారు. దీంతో మనస్తాపానికి, కోపానికి గురైన ఆ బాలుడు ఎవరికీ చెప్పకుండా సైకిల్‌పై ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. నంద్యాల వెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుని, రాత్రంతా ఎక్కడా ఆగకుండా సైకిల్ తొక్కాడు. రాజుపాళెం, చాగలమర్రి మీదుగా సుమారు 100 కిలోమీటర్లు ప్రయాణించి, మరుసటి రోజు ఉదయానికి నంద్యాల చేరుకున్నాడు.

అక్కడ ఖర్చుల కోసం తన సైకిల్‌ను అమ్మేందుకు ప్రయత్నించాడు. అయితే, షాపు యజమాని వివరాలు అడగడంతో భయపడి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత నంద్యాల రైల్వేస్టేషన్ సమీపంలో సైకిల్‌ను వదిలేసి, రైలెక్కి కర్ణాటకలోని రాయచూర్‌కు వెళ్లాడు. మరోవైపు కుమారుడు కనిపించకపోవడంతో తీవ్ర ఆందోళన చెందిన తల్లిదండ్రులు ప్రొద్దుటూరు వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసిన పోలీసులు, బాలుడి వద్ద మొబైల్ ఫోన్ లేకపోవడంతో ఆచూకీ కనుక్కోవడం సవాలుగా మారింది. దీంతో సీసీటీవీ ఫుటేజీలను ఆధారం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. బాలుడు బుక్స్ బ్యాగ్ తగిలించుకుని సైకిల్‌పై వెళ్తున్న దృశ్యాలను గుర్తించి, ఆ మార్గంలోని మరిన్ని కెమెరాలను పరిశీలించారు. బాలుడు నంద్యాల వెళ్లినట్లు నిర్ధారించుకుని, అక్కడి లాడ్జీలు, హోటళ్లలో గాలించారు. చివరకు రైల్వే స్టేషన్ వద్ద అతని సైకిల్‌ను గుర్తించారు. అక్కడి విచారణలో బాలుడు రాయచూర్ వెళ్లినట్లు తెలియడంతో ప్రత్యేక బృందం రాయచూర్ వెళ్లి బాలుడిని సురక్షితంగా ప్రొద్దుటూరు తీసుకొచ్చింది. కుమారుడు క్షేమంగా తిరిగి రావడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. చిన్న విషయానికే ఓ బాలుడు ఇంతటి సాహసం చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
Go Back to Shorts
Prodduturu Boy
Kadapa district
Nandyala
Razolem
Cycle journey
Missing boy
Andhra Pradesh Police
Rapur
Rayachur
CCTV footage

More Telugu News