Bangladesh Bus Accident: బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం.. పద్మా నదిలోకి దూసుకువెళ్లిన బస్సు.. వీడియో ఇదిగో

Bangladesh Bus Accident Padma River Kills 23
షార్ట్స్‌లో చూడండి
బంగ్లాదేశ్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. సుమారు 40 నుంచి 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి పద్మా నదిలో పడిపోయింది. రాజ్‌బరి జిల్లాలోని దౌలత్‌దియా ఫెర్రీ టెర్మినల్ వద్ద ఈ ఘోర దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 23కి చేరినట్లు తెలుస్తుంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

వివరాల్లోకి వెళితే.. ఢాకాకు వెళ్తున్న 'సౌహార్దో పరివాహన్' కు చెందిన బస్సు, ఫెర్రీ ఎక్కేందుకు (బస్సులు వంటివి నదిని దాటేందుకు అక్కడ ఫెర్రీలను వినియోగిస్తారు) ఘాట్ నెం.3 వద్ద పొంటూన్‌పై వేచి చూస్తోంది. అదే సమయంలో 'హస్నా హేనా' అనే చిన్న యుటిలిటీ ఫెర్రీ వేగంగా వచ్చి పొంటూన్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ఆకస్మిక ధాటికి బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో బస్సు నేరుగా పద్మా నదిలోకి దూసుకెళ్లి మునిగిపోయింది. బస్సు నదిలో పడిపోతున్న సమయంలో కొందరు కిటికీలో నుంచి ప్రాణాలను రక్షించుకున్నారు. ఈద్ పండుగ సెలవుల అనంతరం ప్రజలు రాజధాని ఢాకాకు తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

సమాచారం అందుకున్న వెంటనే బంగ్లాదేశ్ ఫైర్ సర్వీస్, నౌకాదళం, నదీ పోలీసులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. దాదాపు ఆరు గంటల పాటు శ్రమించి 'హంజా' అనే రెస్క్యూ నౌక సహాయంతో నీటిలో పూర్తిగా మునిగిపోయిన బస్సును బయటకు తీశారు. 23 మృత దేహాలను వెలికితీసినట్లు పోలీస్ ఇన్‌స్పెక్టర్ రసెల్ మొల్లా మీడియాకు తెలిపారు.

ఈ ఘటనపై బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహమాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, విచారణకు ఆదేశించారు. గల్లంతైన మిగతా ప్రయాణికుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
 
Go Back to Shorts
Bangladesh Bus Accident
Padma River
Bus Accident
Ferry Accident
Doulatdia
Launch Accident
Tarique Rahman
Bangladesh News
Road Accident
Dhaka

More Telugu News