Narayana: అమరావతి 'ఐకానిక్' టవర్లు రెడీ అవుతున్నాయి.. డయాగ్రిడ్ టెక్నాలజీతో అద్భుత నిర్మాణం: నారాయణ
రాజధాని అమరావతిలో రాష్ట్ర స్థాయి అధికారులందరూ ఒకే చోట కొలువుదీరేలా నిర్మిస్తున్న ఐదు ఐకానిక్ టవర్ల పనులు వేగవంతమయ్యాయి. ఈరోజు హెచ్‌ఓడీ టవర్-3 వద్ద 'కార్నర్ నోడ్' అమర్చే పనులను మంత్రి నారాయణ ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అత్యాధునిక డయాగ్రిడ్ సాంకేతికతతో ఈ భవనాలను నిర్మిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
అమరావతి నిర్మాణానికి ప్రజలు చెల్లించే పన్నుల నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడం లేదని మంత్రి స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు రూపొందించిన ప్రత్యేక ఫైనాన్స్ మోడల్ ద్వారానే ఈ నిధులు సమకూరుతున్నాయని, అమరావతి ఒక 'సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ' అని ఆయన గుర్తు చేశారు. గత ఏడాది కురిసిన భారీ వర్షాల వల్ల సుమారు 4 నెలల పాటు పనులకు అంతరాయం కలిగిందని, ఇప్పుడు పనుల వేగాన్ని పెంచామని తెలిపారు. ఐకానిక్ భవనాలతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారుల నివాస సముదాయాల పనులు కూడా తుది దశకు చేరుకున్నాయని వివరించారు.
రాయపూడి వద్ద జరిగిన అగ్నిప్రమాదంపై సీఎం ఇప్పటికే సమీక్షించారని, ఒకవేళ ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఈ ప్రమాదానికి పాల్పడి ఉంటే వారిపై కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. ప్రస్తుతం దీనిపై పూర్తిస్థాయి విచారణ జరుగుతోందని చెప్పారు.
డయాగ్రిడ్ టెక్నాలజీ అంటే ఏమిటి?
ఈ టవర్ల నిర్మాణంలో వాడుతున్న డయాగ్రిడ్ టెక్నాలజీ వల్ల భవనానికి లోపల పిల్లర్లు ఉండాల్సిన అవసరం తక్కువగా ఉంటుంది. దీనివల్ల లోపల స్థలం ఎక్కువగా లభిస్తుంది. ఉక్కును త్రిభుజాకారపు గ్రిడ్లుగా అమర్చడం వల్ల భవనానికి అద్భుతమైన పటుత్వంతో పాటు ఒక ఆధునిక లుక్ వస్తుంది.