Narendra Modi: ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్... పశ్చిమాసియా పరిస్థితులపై చర్చ

Modi Trump discuss West Asia situation and Hormuz Strait
షార్ట్స్‌లో చూడండి
ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ఫోన్‌లో సంభాషించారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు, వ్యూహాత్మకంగా కీలకమైన హార్ముజ్ జలసంధిని తెరిచి ఉంచాల్సిన ఆవశ్యకతపై ఇరువురు నేతలు ప్రధానంగా చర్చించుకున్నారు. ఈ విషయాన్ని భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ 'ఎక్స్' ద్వారా ధృవీకరించారు.

ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మృతికి దారితీసిన ఫిబ్రవరి 28 దాడుల తర్వాత పశ్చిమాసియాలో సంక్షోభం తీవ్రమైంది. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన ఈ దాడులకు ప్రతిగా ఇరాన్.. ఆయా దేశాల స్థావరాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లు ఒత్తిడికి గురవుతుండగా, ఇంధన ధరలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఈ క్రమంలో మోదీ, ట్రంప్ మధ్య ఫోన్ కాల్ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదిలా ఉండగా, ఒకరోజు ముందే భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా ఫోన్‌లో మాట్లాడుకున్నారు. పశ్చిమాసియా సంక్షోభం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా ఇంధన భద్రతపై చూపుతున్న ప్రభావం గురించి చర్చించామని జైశంకర్ తెలిపారు. పరస్పర ప్రాధాన్యత కలిగిన అంశాలపై కలిసి పనిచేయాలని ఇరుపక్షాలు అంగీకరించినట్లు అమెరికా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఏడాది భారత్‌లో జరగనున్న క్వాడ్ సదస్సు నేపథ్యంలో ట్రంప్ పర్యటించే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Narendra Modi
Donald Trump
West Asia crisis
Iran
Hormuz Strait
US foreign policy
India US relations
EAM Jaishankar
Marco Rubio
Quad Summit

More Telugu News