Allu Aravind: అల్లు సినిమాస్ కట్టడానికి రెండు కారణాలున్నాయి: అల్లు అరవింద్
హైదరాబాద్‌లోని కోకాపేటలో సినీ ప్రియులకు ఒక అద్భుతమైన వినోద ప్రపంచం అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన 'అల్లు సినిమాస్' ఘనంగా ప్రారంభమయింది. మరోవైపు, మీడియా ప్రతినిధుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక స్క్రీనింగ్‌లో ఈ థియేటర్ లోని అత్యాధునిక సాంకేతికతను ప్రదర్శించారు. ముఖ్యంగా ఇందులోని డాల్బీ విజన్, సౌండ్ సిస్టమ్ పనితీరును చూపించేందుకు 'పుష్ప-2', 'ఆర్ఆర్ఆర్' సన్నివేశాలతో పాటు, 'వారణాసి', హిందీ 'రామాయణ్' 3డీ ట్రైలర్లను ప్రదర్శించారు.
ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ, తన రెండేళ్ల నిరంతర శ్రమకు ఈ థియేటర్ ఫలితమని ఆనందం వ్యక్తం చేశారు. తాను ఇంత పెద్ద స్క్రీన్‌తో మల్టీప్లెక్స్ నిర్మించడానికి రెండు ప్రధాన సంఘటనలు ప్రేరణగా నిలిచాయని ఆయన వెల్లడించారు. ఒకటి యూవీ క్రియేషన్స్ వంశీ సూళ్లూరుపేటలో నిర్మించిన భారీ థియేటర్ కాగా... రెండోది, తనకు తెలిసిన ఒక బడా వ్యాపారవేత్త 'మిషన్ ఇంపాజిబుల్ 6' టికెట్ల కోసం పడిన ఇబ్బందిని చూడటం. ఈ రెండు సంఘటనలే తనను ఒక అద్భుతమైన బిగ్ స్క్రీన్ అనుభవాన్ని ప్రేక్షకులకు అందించాలనే దిశగా అడుగులు వేయించాయని తెలిపారు.
డాల్బీ విజన్ టెక్నాలజీతో కూడిన ఈ బిగ్ స్క్రీన్ థియేటర్ లో ఏకంగా 72 స్పీకర్లు, 165 సౌండ్ అవుట్‌లెట్లను అమర్చారు. కేవలం ఈ సౌండ్ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేయడానికే 9 నెలల సమయం పట్టింది. 600కు పైగా సీటింగ్ కెపాసిటీ కలిగిన ఈ మల్టీప్లెక్స్‌లో మొత్తం నాలుగు స్క్రీన్లు అందుబాటులో ఉన్నాయి. గరిష్ఠంగా టికెట్ ధరను 450 రూపాయలుగా నిర్ణయించారు.