Iran: అమెరికాపై ఇరాన్ సైబర్ దాడులు... టార్గెట్లను పంచుకున్నారు!

Iran Cyber Attacks on America Target Sharing
  • ఫిబ్రవరి 28 దాడుల తర్వాత అమెరికాపై ఇరాన్ హ్యాకర్ల సైబర్ దాడులు
  • టెలిగ్రామ్ ద్వారా ఎలక్ట్రానిక్ ఆపరేషన్స్ రూమ్ ఏర్పాటు చేసిన 60కి పైగా గ్రూపులు
  • ప్రమాదంలో అమెరికాలోని 40 వేలకు పైగా ఇండస్ట్రియల్ కంట్రోల్ సిస్టమ్స్
  • ఏఐ సాంకేతికతతో ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేకపోయినా సులువుగా దాడులు
  • సైబర్ సెక్యూరిటీ సంస్థ క్లౌడ్‌సెక్ తాజా నివేదికలో వెల్లడి
ఫిబ్రవరి 28న ఇరాన్‌పై జరిగిన దాడుల తర్వాత అమెరికా కీలక వ్యవస్థలపై సైబర్ ముప్పు తీవ్రమైంది. ఆ దాడులు జరిగిన కొన్ని గంటల్లోనే 60కి పైగా ఇరాన్ అనుకూల హ్యాకింగ్ గ్రూపులు ఆన్‌లైన్ వేదికగా అమెరికాపై దాడులకు సిద్ధమైనట్లు ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ 'క్లౌడ్‌సెక్' సోమవారం విడుదల చేసిన రిపోర్టులో వెల్లడించింది.

ఈ హ్యాకర్లంతా టెలిగ్రామ్ వేదికగా 'ఎలక్ట్రానిక్ ఆపరేషన్స్ రూమ్'ను ఏర్పాటు చేసుకుని, తమ టార్గెట్లను పంచుకుంటున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ప్రభుత్వ ఆదేశాల కంటే కూడా సైద్ధాంతిక కారణాలతోనే వీరు ఏకమవుతుండటంతో ఈ దాడులను అంచనా వేయడం, అడ్డుకోవడం కష్టంగా మారిందని నివేదిక పేర్కొంది. అమెరికాలోని పవర్ గ్రిడ్లు, వాటర్ సప్లై నెట్‌వర్క్‌లు, ఉత్పాదక సంస్థలను నియంత్రించే సుమారు 40 వేలకు పైగా ఇండస్ట్రియల్ కంట్రోల్ సిస్టమ్స్ (ఐసీఎస్) పబ్లిక్ ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయి ఉన్నాయని, వీటికి కనీస పాస్‌వర్డ్ భద్రత కూడా లేకపోవడం ఆందోళన కలిగిస్తోందని తెలిపింది.

కృత్రిమ మేధ (ఏఐ) రాకతో ఈ సైబర్ దాడులు చేయడం హ్యాకర్లకు మరింత సులువుగా మారిందని క్లౌడ్‌సెక్ పరిశోధకులు తెలిపారు. సిస్టమ్స్‌పై ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేని వ్యక్తులు సైతం ఏఐ టూల్స్ సహాయంతో కేవలం ఐదు నిమిషాల్లోనే అమెరికాలోని టార్గెట్లను గుర్తించగలరని సంస్థ జరిపిన ఒక ప్రయోగంలో తేలింది. దీనికోసం ఎలాంటి ప్రత్యేక టూల్స్ వాడాల్సిన అవసరం కూడా లేకపోవడం గమనార్హం.

డిఫెన్స్, సెక్యూరిటీ కోసం వాడే ఏఐ టూల్స్‌నే హ్యాకర్లు ఇప్పుడు దాడులకు వాడుకుంటున్నారని నిపుణులు హెచ్చరించారు. అమెరికాపై సైబర్ ముప్పు దశాబ్ద కాలంగా పెరుగుతూ వస్తోందని, అయితే ఫిబ్రవరి 28 దాడులు ఆ ముప్పును మరింత వేగవంతం చేశాయని క్లౌడ్‌సెక్ సంస్థ స్పష్టం చేసింది.
Iran
Iran cyber attacks
America cyber attacks
CloudSEK
cyber security
hacking groups
industrial control systems
AI tools
cyber threat

More Telugu News