హోర్ముజ్ జలసంధి మూసివేత!: ఆకాశానికి చమురు ధరలు.. బ్యారెల్‌కు 100 డాలర్లు దాటే ప్రమాదం!
- బ్రెన్ట్ క్రూడ్ ఆయిల్ ధర 8 నెలల గరిష్టానికి
- సోమవారం నాటికి 20 డాలర్ల వరకు పెరిగే ఛాన్స్
- చమురు నిల్వలపై భారత్ అత్యవసర ప్రణాళిక
- ద్రవ్యోల్బణం పెరిగే అవకాశంపై నిపుణుల హెచ్చరిక
భారతదేశం తన చమురు అవసరాల్లో దాదాపు 90 శాతం దిగుమతులపైనే ఆధారపడుతుంది. చమురు ధర బ్యారెల్‌కు 10 డాలర్లు పెరిగితే, భారత్ అదనంగా దాదాపు $13-14 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 1.15 లక్షల కోట్లు) భారాన్ని భరించాల్సి ఉంటుంది. దీనివల్ల పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడమే కాకుండా రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆకాశాన్నంటే ప్రమాదం ఉంది.
పరిస్థితిని గమనిస్తున్న భారత ప్రభుత్వం ఇప్పటికే రంగంలోకి దిగింది. అత్యవసర పరిస్థితుల కోసం మన దగ్గర ఉన్న 'స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్' (చమురు నిల్వలు) సుమారు 74 రోజుల పాటు దేశ అవసరాలకు సరిపోతాయని అధికారులు చెబుతున్నారు. అలాగే ఇతర దేశాల నుంచి చమురు దిగుమతులను వేగవంతం చేసే దిశగా అడుగులు వేస్తోంది.