Chandrababu Naidu: సీఎం చంద్రబాబుపై ఫేక్ పోస్టులు.. సీఐడీ డీజీకి టీడీపీ నేతల ఫిర్యాదు

Chandrababu Naidu Targeted with Fake Posts TDP Files Complaint
  • సీఐడీ డీజీని కలిసి ఫిర్యాదు చేసిన వర్ల రామయ్య, నజీర్ అహ్మద్
  • ఎఫ్‌బీఐ, ఎప్‌స్టీన్ పేర్లతో చంద్రబాబుపై తప్పుడు పోస్టులు సృష్టించారని ఆరోపణ
  • జగన్, సజ్జల, భార్గవ రెడ్డిల డైరెక్షన్‌లోనే ఈ కుట్ర జరుగుతోందని మండిపాటు
  • దామురెడ్డి అనే వ్యక్తి ద్వారా సోషల్ మీడియాలో అసత్య ప్రచారం
  • బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతల డిమాండ్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తిత్వాన్ని హననం చేసేలా సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారంటూ తెలుగుదేశం పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు నేడు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్, ఇతర నేతలు సీఐడీ డీజీని కలిసి ఫిర్యాదు చేశారు. వైసీపీ సోషల్ మీడియా విభాగం 'ఫేక్' పత్రాలతో విష ప్రచారం చేస్తోందంటూ వారు ఆధారాలను సమర్పించారు.

అనంతరం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వర్ల రామయ్య మాట్లాడారు. 2024 ఎన్నికల్లో ప్రజలు ఘోరంగా ఓడించి 11 సీట్లకే పరిమితం చేసినా జగన్ తీరులో మార్పు రాలేదని మండిపడ్డారు. అధికారం కోల్పోయిన ఫ్రస్ట్రేషన్‌లో ఉన్న జగన్.. చంద్రబాబుపై బురద జల్లి మళ్లీ సీఎం పీఠం ఎక్కాలని కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. జగన్, సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ రెడ్డి కలిసి ఒక 'నేరపూరిత కుట్ర'కు తెరలేపారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇందులో భాగంగానే చంద్రబాబును అప్రతిష్ఠ పాలు చేసేందుకు 'ఎఫ్‌స్టీన్ ఫైల్స్' తరహాలో తప్పుడు పత్రాలు సృష్టించారని పేర్కొన్నారు.

'దామురెడ్డి' అనే వ్యక్తి ద్వారా ఎఫ్‌బీఐ క్లాసిఫైడ్ డాక్యుమెంట్ల పేరుతో నకిలీ పత్రాలను సృష్టించి, చంద్రబాబును ఒక హై ప్రొఫైల్ అనుమానితుడిగా చూపించే వికృత ప్రయత్నం చేశారని వర్ల రామయ్య వివరించారు. ఈ పోస్టులను చూసి సీఐడీ డీజీ సైతం దిగ్భ్రాంతి చెందారని, ఇంత నీచంగా వ్యవహరిస్తారా అని ఆశ్చర్యపోయారని తెలిపారు. పరస్త్రీలను గౌరవించే సంస్కారం ఉన్న చంద్రబాబుపై ఇటువంటి అశ్లీల ఆరోపణలు చేయడం సూర్యుడి మీద ఉమ్మి వేయడమేనని హెచ్చరించారు. రాష్ట్రంలో కులమతాల మధ్య చిచ్చుపెట్టి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలన్నదే వైసీపీ లక్ష్యమని ఆయన ధ్వజమెత్తారు.

ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే వైసీపీ ఇటువంటి నీచ రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. సజ్జల భార్గవ రెడ్డి నేతృత్వంలోని సోషల్ మీడియా 'సైకో సైన్యం' చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. దామురెడ్డికి, సజ్జల భార్గవకు మధ్య ఉన్న సంబంధాలపై కూలంకషంగా దర్యాప్తు జరిపించాలని, నిందితులు ఎంతటి వారైనా అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. డీజీ గారు సానుకూలంగా స్పందించి, కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు, బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ బుచ్చి రాంప్రసాద్, బండారు వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


Chandrababu Naidu
Varla Ramaiah
TDP
YS Jagan
Sajjala Ramakrishna Reddy
CID AP
Fake News
Social Media
AP Politics
TDP Leaders

More Telugu News