శ్రీవారి హుండీలో ఇక డిజిటల్ మొక్కులు.. 'ముడుపు పత్రం' విధానానికి టీటీడీ శ్రీకారం

TTD Introduces Digital Offerings in Srivari Hundi with Mudupu Patram
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు టీటీడీ ఒక శుభవార్త చెప్పింది. హుండీలో కానుకలు సమర్పించేందుకు నగదు లేదా చిల్లర అందుబాటులో లేని ఇబ్బందులకు చెక్ పెడుతూ 'శ్రీవారి ముడుపు పత్రం' పేరుతో ఒక వినూత్న విధానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. డిజిటల్ చెల్లింపులు పెరిగిన ప్రస్తుత కాలానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ విధానంలో భాగంగా, తిరుపతి, తిరుమలలోని కీలక ప్రాంతాల్లో టీటీడీ ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తుంది. భక్తులు ఈ కౌంటర్ల వద్ద తమ స్తోమతను బట్టి రూ.100 నుంచి రూ.లక్ష వరకు యూపీఐ (ఫోన్‌పే, జీపే), క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల ద్వారా చెల్లించవచ్చు. చెల్లింపు పూర్తయిన తర్వాత, భక్తులకు ఒక 'ముడుపు పత్రం' అందజేస్తారు. ఈ పత్రాన్ని భక్తులు గర్భాలయం వెలుపల ఉన్న శ్రీవారి హుండీలో వేసి తమ మొక్కును చెల్లించుకోవచ్చు.

వాస్తవానికి భక్తులు డిజిటల్ రూపంలో చెల్లించినప్పుడే ఆ మొత్తం టీటీడీ ఖాతాకు జమవుతుంది. అయితే, తమ చేతులతోనే హుండీలో కానుకలు సమర్పించాలనే భక్తుల విశ్వాసాన్ని, మనోభావాలను గౌరవిస్తూ టీటీడీ ఈ 'ముడుపు పత్రం' విధానాన్ని ప్రవేశపెడుతోంది. 2025లో శ్రీవారి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో రూ.1,383 కోట్లుగా నమోదైంది. ఈ కొత్త విధానం ద్వారా ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ నెల 28న జరిగే టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో ఈ ప్రతిపాదనపై చర్చించి అధికారికంగా ఆమోదముద్ర వేయనున్నారు.
Go Back to Shorts
TTD
Tirumala
Srivari Hundi
Digital Offerings
Mudupu Patram
UPI Payments
TTD Board Meeting
Tirupati
Devotees
Hundi Income

More Telugu News