Bhupendra Shahi: వంటమనిషి కాదు.. 'వజ్రాల' దొంగ.. జూబ్లీహిల్స్‌లో ఘరానా దోపిడీ

Hyderabad Jubilee Hills Heist Cook Steals Diamonds From Businessman
  • నేపాలీ గ్యాంగ్ ఘాతుకం.. మత్తుమందు ఇచ్చి చోరీ
  •  కేవలం గంట వ్యవధిలోనే పని పూర్తి చేసిన వంటమనిషి
  • ఆభరణాలతో పరారైన ముఠా.. ఏజెంట్ అరెస్ట్
హైదరాబాద్‌లోని అత్యంత సంపన్న ప్రాంతమైన జూబ్లీహిల్స్‌లో సినిమా క్లైమాక్స్‌ను తలపించేలా భారీ చోరీ జరిగింది. నమ్మకంగా వంటమనిషిగా చేరిన ఒక వ్యక్తి, యజమానులు లేని సమయం చూసి తోటి పనివారికి మత్తు మందు ఇచ్చి, కోటి రూపాయలకు పైగా విలువైన వజ్రాభరణాలను ఊడ్చుకెళ్లాడు. నందగిరి హిల్స్‌లోని వ్యాపారి రవీంద్రశర్మ నివాసంలో ఈ ఘటన వెలుగుచూసింది.

నేపాల్‌కు చెందిన భూపేంద్రషాహీ అలియాస్‌ భువన్‌ అనే వ్యక్తి 15 రోజుల క్రితమే ఓ ఏజెంట్ ద్వారా రవీంద్రశర్మ ఇంట్లో వంటమనిషిగా చేరాడు. గురువారం సాయంత్రం కుటుంబ సభ్యులంతా బయటకు వెళ్లిన సమయాన్ని నిందితుడు తనకు అనువుగా మార్చుకున్నాడు. తన పుట్టినరోజు అంటూ వాచ్‌మన్ సహా ఇతర పనిమనుషులకు మత్తుమందు కలిపిన శీతలపానీయం ఇచ్చాడు. వారు స్పృహ కోల్పోగానే మరో ఇద్దరు స్నేహితులను పిలిపించి, రెండో అంతస్తులోని అల్మారాలను ధ్వంసం చేసి వజ్రాలు, బంగారు నగలను దోచుకున్నాడు.

సరిగ్గా చోరీ ముగించుకుని బయటకు వస్తుండగా యజమాని కోడలు ఇంటికి చేరుకుంది. ఆమెను తోసుకుంటూ నిందితులు ముగ్గురూ బైక్‌పై పారిపోయారు. లోపలికి వెళ్లి చూడగా అప్పటికే వాచ్‌మన్ దంపతులు తాళ్లతో బంధించబడి ఉండటం, లాకర్‌లోని నగలు మాయమవడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన జూబ్లీహిల్స్ పోలీసులు నిందితులను చేర్పించిన ఏజెంట్ మదన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ దోపిడీ వెనుక ప్రొఫెషనల్ నేపాలీ గ్యాంగ్ హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 
Bhupendra Shahi
Jubilee Hills
Hyderabad
Diamond theft
Cook theft
Ravindra Sharma
Nepal gang
Crime news
Theft case
Nandagiri Hills

More Telugu News