WPL Final: డబ్ల్యూపీఎల్ ఫైనల్... ఆర్సీబీకి భారీ టార్గెట్ ఇచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్

WPL Final Delhi Capitals Set Huge Target for RCB
  • డబ్ల్యూపీఎల్ 2026 ఫైనల్‌లో ఆర్సీబీ ముందు 204 పరుగుల టార్గెట్
  • అర్ధశతకంతో మెరిసిన ఢిల్లీ కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్
  • మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడిన వోల్వార్డ్ట్, హెన్రీ
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుని దెబ్బతిన్న బెంగళూరు
  • విఫలమైన ఆర్సీబీ బౌలర్లు
వడోదర వేదికగా జరుగుతున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2026 ఫైనల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న టైటిల్ పోరులో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోరు సాధించారు. దీంతో రెండోసారి కప్ గెలవాలని ఆశిస్తున్న ఆర్సీబీకి 204 పరుగుల కఠినమైన లక్ష్యాన్ని నిర్దేశించారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ నిర్ణయం బెడిసికొట్టింది.

ఢిల్లీ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్ ముందుండి నడిపించింది. కేవలం 37 బంతుల్లో 8 ఫోర్లతో 57 పరుగులు చేసి జట్టుకు కీలక స్కోరు అందించింది. ఆమెకు తోడుగా లారా వోల్వార్డ్ట్ (25 బంతుల్లో 44), ఓపెనర్ లిజెల్ లీ (30 బంతుల్లో 37) రాణించారు. ఆఖర్లో చినెల్ హెన్రీ ఆకాశమే హద్దుగా చెలరేగింది. కేవలం 15 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 35 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. దీంతో ఢిల్లీ స్కోరు 200 పరుగులు దాటింది.

బెంగళూరు బౌలర్లలో లారెన్ బెల్ మినహా అందరూ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. బెల్ 4 ఓవర్లలో కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చి వికెట్ తీయలేకపోయింది. సయాలీ సత్ఘరే, అరుంధతి రెడ్డి, నడీన్ డి క్లర్క్ తలో వికెట్ పడగొట్టినప్పటికీ, భారీగా పరుగులు ఇచ్చుకున్నారు. శ్రేయాంక పాటిల్ రెండు ఓవర్లలోనే 32 పరుగులు సమర్పించుకోవడం గమనార్హం. ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించి ఆర్సీబీ టైటిల్ కల నెరవేర్చుకుంటుందో లేదో చూడాలి.

More Telugu News

WPL Final
Delhi Capitals
Royal Challengers Bangalore
Womens Premier League
Jemimah Rodrigues
Laura Wolvaardt
RCB vs DC
Cricket
T20 Cricket